PM Modi: కర్ణాటకలో కాంగ్రెస్ నేత జీఎస్ మంజునాథ్ ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఇటీవల మోదీ సర్కార్ గ్యాస్ సిలిండర్ ధరని రూ.100 మేర తగ్గించింది. ఈ నిర్ణయంపైనే మంజునాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చిత్రదుర్గలో జరుగుతున్న ఓ కార్యక్రమంలో నోరు జారారు. కేవలం ఎన్నికలొస్తున్నాయనే గ్యాస్ సిలిండర్ ధర తగ్గించారని, ప్రధాని మోదీ ఎదురుగా వస్తే కొట్టాలనిపిస్తోందని మండి పడ్డారు. 


"కొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. అందుకే ఉన్నట్టుండి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధరని రూ.100 తగ్గించారు. ఇప్పుడు కనక మోదీ నా కంటపడితే వెంటనే మీద పడి కొట్టాలనిపిస్తోంది. ఇప్పుడు ధర ఎందుకు తగ్గిస్తున్నారు. ఈ దేశ పౌరుడిగా ప్రధానిని ప్రశ్నించాలి. ఇలా ప్రశ్నించడాన్ని మనం అందరం నేర్చుకోవాలి. కాంగ్రెస్‌ కావచ్చు,జేడీఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. మనం అడిగితే ముందు వినకపోవచ్చు. కానీ మనం మాత్రం ప్రశ్నించడాన్ని ఆపకూడదు"


- జీఎస్ మంజునాథ్, కాంగ్రెస్ నేత 




నిజానికి మంజునాథ్ ప్రధానిపై కాస్త  పరుషంగానే మాట్లాడారు. ఏది దొరికితే అది తీసుకుని కొట్టేస్తానంటూ నోరు పారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలే దుమారం రేపుతున్నాయి. కర్ణాటక బీజేపీ ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంజునాథ్ వ్యాఖ్యల వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే...అటు ప్రధాని నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు. తాను మహిళా సాధికారత గురించి ప్రస్తావించిన ప్రతిసారీ కాంగ్రెస్ నేతలు వ్యక్తిగతంగా దూషిస్తున్నారని మండి పడ్డారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయని తేల్చి చెప్పారు.