Deepak Saroj’s  Siddharth Roy Movie: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘అతడు’. ఈ సినిమా ఇప్పటికీ చాలా మందికి ఎంతో ఇష్టం. ఎన్నిసార్లు టీవీల్లో వచ్చినా, మిస్ కాకుండా చూస్తారు. ఈ మూవీలోని ప్రతి సీన్, ప్రతి డైలాగ్ వారెవ్వా అనిపిస్తుంది. ఈ సినిమాలో బ్రహ్మానందం కొడుకుగా నటించిన కుర్రాడు ఇప్పటికీ అందరికీ గుర్తుంటాడు. అత్తారింటికి వచ్చిన బ్రహ్మానందంతో “నాన్నా నా కోసం ట్రైన్ తెచ్చావా?” అని అడుగుతాడు. “హా తెచ్చా రా రైల్వే స్టేషన్ లో ఉంది వెళ్లి తెచ్చుకోపో” అంటూ బ్రహ్మీ చెప్పే డైలాగ్ పటాస్ లా పేలుతుంది. ‘అతడు’లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన ఆ కుర్రాడి పేరే దీపక్ సరోజ్. ఇప్పుడు అదే కుర్రాడు హీరోగా ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా?


దీపక్ సరోజ్ హీరోగా తెరకెక్కిన ‘సిద్ధార్థ్ రాయ్’


‘అతడు’ తర్వాత దీపక్ సరోజ్ పలు సినిమాల్లో నటించాడు. ‘ఆర్య’, ‘లెజెండ్’, ‘పెద్దబాబు’, ‘ఆంధ్రుడు’, ‘భద్ర’ సినిమాల్లో బాల నటుడిగా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘మిణుగురులు’ అనే సినిమాలో చక్కటి క్యారెక్టర్ తో ఆకట్టుకున్నారు. అనంతరం ‘వందనం’ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అదే కుర్రాడు హీరోగా ఇప్పుడు ‘సిద్ధార్థ్ రాయ్’ అనే సినిమా తెరకెక్కింది. ఈ చిత్రానికి యశస్వి దర్శకత్వం వహించారు.



బోల్డ్ సీన్లతో నిండిపోయిన ‘సిద్ధార్థ్ రాయ్’ ట్రైలర్


రీసెంట్ గా విడుదలైన ‘సిద్ధార్థ్ రాయ్’ ట్రైలర్ బోల్డ్ సీన్లతో నిండిపోయింది. “నాలాంటి ప్రేమ డిఫరెంట్” అనే డైలాగ్ తర్వాత దీపక్ సరోజ్ గట్టిగా అరిచే సన్నివేశంతో మూవీ ట్రైలర్ షురూ అవుతుంది. “వర్జినిటీని 17 సంవత్సరాలకు కోల్పోయా”,  “నేను లవ్ కోసం కాదు.. లవ్ మేకింగ్ కోసం” అంటూ దీపక్ చెప్పే డైలాగులు చూస్తుంటే ఈ మూవీ బోల్డ్ కంటెంట్ తో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.


అమ్మాయిని సిగరెట్ ఉందా? లేదంటే కండోమ్ ఉందా? అంటూ అడగడం చూస్తుంటే మాంచి మసాలా దట్టించినట్లు అర్థం అవుతోంది. ఈ సినిమా ట్రైలర్ లో లిప్ లాక్ సన్నివేశాలకు కొదవేం లేదు. ఈ మూవీలో తన్వి నేగీ హీరోయిన్‍గా నటించింది. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని వ్యక్తిగా సిద్ధార్థ్ రాయ్ ఉంటాడు. అతడి ఎమోషన్‍ను కంట్రోల్ చేసేందుకు హీరోయిన్ ప్రయత్నిస్తుంటుంది. భవిష్యత్తులో ప్రపంచం నాశమయ్యేందుకు ప్యాండమిక్‍కో, ప్రకృతి విపత్తో కారణం కాబోదని, ఎమోషన్లే కారణమవుతాయనే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటుంది.  


ఈ నెల 23న థియేటర్లలో విడుదల


‘సిద్ధార్థ్ రాయ్’ చిత్రంలో ఆనంద్, కల్యాణి నటరాజ్, మాథ్యూ వర్గీస్, నందినీ, కీర్తన కీలకపాత్రలు చేశారు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్, విహిన్ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. జయ అడపాక ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ చేశారు. ‘అర్జున్ రెడ్డి’ చిత్రానికి సంగీతం అందించిన రధనే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Read Also: మహేష్ మూవీలో ఇండోనేషియన్ నటి, అసలు విషయం చెప్పేసిన జక్కన్న టీమ్