Art Director Anand Sai About Pawan Kalyan: సినీ పరిశ్రమలో ఆఫ్ స్క్రీన్ కష్టపడేవారిలో ఆర్ట్ డైరెక్టర్స్ కూడా ఒకరు. కానీ వారి గురించి చాలామంది ప్రేక్షకులకు తెలియదు. అయినా కూడా మూవీస్ కోసం మంచి సెట్స్ వేసి ఆర్ట్ వర్క్ చేస్తూ కష్టపడేవారు ఉంటారు. అలా టాలీవుడ్‌లో తన ఆర్ట్ వర్క్‌తో అందరినీ ఇంప్రెస్ చేసినవారిలో ఆనంద్ సాయి ఒకరు. ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ అవ్వకముందు నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. తాజాగా వారిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ గురించి, పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి రావడానికి ఎదుర్కున్న కష్టాల గురించి చెప్పుకొచ్చారు ఆనంద్ సాయి.


దాని గురించి మాట్లాడం..


‘‘నాది, పవన్ కళ్యాణ్‌ది చాలా అందమైన జర్నీ. చెప్పినా ఆ ఫీల్ మిస్ అయిపోతుంది. నేను కళ్యాణ్‌తో చాలా షేర్ చేసుకున్నాను. తన గురించి చెప్పాలంటే చాలా సింపుల్ మనిషి. మేము కలిసి చాలా తిరిగాం. అప్పుడు తనకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు. తనే నన్ను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చాడు. ఎందుకంటే తనకు హైదరాబాద్‌లో ఫ్రెండ్స్ ఎవరూ లేరు. నేను కూడా సినిమాలు చేస్తే హైదరాబాద్‌కు వచ్చేస్తానని తీసుకొచ్చాడు. కళ్యాణ్ ఏదైనా అనుకుంటే దానిపై వర్క్ చేస్తాడు. పదేళ్ల తర్వాత గురించి కూడా ఇప్పుడే ప్లాన్ చేసుకుంటాడు. మేమిద్దరం పాలిటిక్స్ గురించి ఏమీ మాట్లాడం. నాకు పాలిటిక్స్ గురించి అంత అవగాహన లేదు. అందుకే ఆయన కూడా నాతో ఎప్పుడూ దీని గురించి మాట్లాడరు’’ అని తమ ఫ్రెండ్‌షిప్‌ గురించి చెప్పుకొచ్చారు ఆనంద్ సాయి.


ప్రాక్టీస్‌లో దెబ్బలు..


‘‘కళ్యాణ్ సినిమాల్లోకి రావాలని కరాటేలో జాయిన్ అయ్యి బ్లాక్ బెల్ట్ తీసుకున్నాడు. తను ఒక సక్సెస్‌ఫుల్ ఫ్యామిలీ నుండి వచ్చాడు. తన అన్నయ్య ఒక పెద్ద స్టార్. అలాంటి ఫ్యామిలీ నుండి వచ్చి కళ్యాణ్ ఈజీగా హీరో అయ్యిండొచ్చు. కానీ నేను కష్టపడి రావాలి అనుకున్నాడు. అందుకే తనకంటూ ఒక స్టైల్ ఉంటుంది. నేను నేనుగా కనపడాలి అని ఎప్పుడూ కోరుకుంటాడు. మామూలుగా చాలామంది సినిమాల్లోకి రావాలంటే డ్యాన్స్ నేర్చుకుంటారు కానీ కళ్యాణ్ చాలా డిఫరెంట్. తను అప్పుడు ప్రాక్టీస్‌లో తీసుకున్న దెబ్బలు.. ఇప్పుడు బెస్ట్ రిజల్ట్ ఇచ్చాయి. అందుకే మేము సక్సెస్, ఫ్లాప్ గురించి మాట్లాడుకోము. అది మన చేతిలో ఉండదు’’ అంటూ పవన్ కళ్యాణ్ పడిన కష్టాల గురించి బయటపెట్టారు ఆనంద్.



ఏదీ ఆశించం..


‘‘డైరెక్టర్ మీద నమ్మకంతో ఉంటాడు కళ్యాణ్. మా మధ్య ఎప్పుడూ గొడవలు, మనస్పర్థలు రాలేదు. తను సినిమాల్లో బిజీగా ఉన్నాడు. నేను ప్రభుత్వం తరపున పనిచేస్తున్నాను. నేను షూటింగ్‌కు వెళ్లి ఎప్పుడూ డిస్టర్బ్ చేయను. ఎందుకంటే ఆ ప్రొఫెసన్ గురించి నాకు తెలుసు. దానికి ఇవ్వాల్సిన విలువ నేను ఇస్తాను. తను ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేస్తే కలుస్తాం. మేము ఒకరి నుండి మరొకరం ఏమీ ఆశించం. మా ఫ్రెండ్‌షిప్‌కు మేము అంత వాల్యూ ఇస్తాం. మా ఇంట్లో ఏమైనా జరిగితే ముందుంటాడు, నేను అంతే. తను తప్పా నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు’’ అని తెలిపారు ఆనంద్ సాయి. చిరంజీవి గురించి కూడా మాట్లాడుతూ ఆయన కష్టానికి పద్మవిభూషణ్ ఎప్పుడో వచ్చుండాల్సింది అని అభిప్రాయం వ్యక్తం చేశారు.


Also Read: నేను కాదు, ఆయనే వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు - పవన్ ఫ్యాన్‌కు రేణు దేశాయ్ ఘాటు రిప్లై! కామెంట్ వైరల్