Alia Bhatt DeepFake Video: ఈరోజుల్లో టెక్నాలజీ అనేది ఎంత మంచి చేస్తుందో.. అంతే చెడు కూడా చేస్తుందని నిపుణులు చెప్తుంటారు. అలా దాని వల్ల జరిగే చెడు పరిణామాలు ఏంటని చాలా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సినీ సెలబ్రిటీల విషయంలో అయితే టెక్నాలజీ వాడకం అనేది శృతిమించిపోతోంది. ఇప్పటికే ఏఐ టెక్నాలజీ వల్ల చాలా నష్టాలు ఉంటాయని నిపుణులు హెచ్చిరిస్తుండగా.. డీప్‌ఫేక్ అనే ఏఐ టెక్నాలజీ వల్ల సినీ సెలబ్రిటీల మొహాలు మార్ఫ్ చేసి అసభ్యకర వీడియోలు తయారు చేస్తున్నారు కొందరు దుండగులు. తాజాగా ఆలియా భట్‌కు సంబంధించిన మరో డీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


రెండోసారి..


మొదటిగా కన్నడ బ్యూటీ రష్మిక మందనా డీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అప్పటివరకు డీప్ ఫేక్ అనే ఒక టెక్నాలజీ కూడా ఉంటుందని తెలియని ప్రేక్షకులు.. నిజంగానే ఆ వీడియో ఉన్నది రష్మికనే అని నమ్మారు. మెల్లగా ఏఐకు చెందిన డీప్ ఫేక్ అని టెక్నాలజీ ద్వారా ఇలాంటివి చేయవచ్చని బయటపడింది. ఆ తర్వాత చాలామంది ఇలాంటి టెక్నాలజీ వల్ల జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు. అయినా కూడా రష్మిక తర్వాత పలువురు హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు కూడా ఈ టెక్నాలజీ వల్ల మార్ఫ్ అయ్యాయి. ఇప్పటికే ఆలియా భట్.. ఒకసారి దీనికి బాధితురాలు కాగా మరోసారి తన డీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం సంచలనంగా మారింది.


ట్రెండ్ ఫాలో అవుతూ..


ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఎన్నో ట్రెండ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అలాగే తాజాగా కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్లు.. ‘గెట్ రెడీ విత్ మీ’ అనే ట్రెండ్‌ను స్టార్ట్ చేశారు. ఆలియా భట్ కూడా ఈ ట్రెండ్‌లో పాల్గొన్నట్టుగా ఒక వీడియో వైరల్ అయ్యింది. ఇందులో తను బ్లాక్ కుర్తా వేసుకొని కనిపించింది. ఆ తర్వాత ఇది ఒక డీప్ ఫేక్ వీడియో అనే విషయం బయటపడింది. అయితే ఇంతకు ముందు కూడా ఆలియా.. ఒక వైట్ అండ్ బ్లూ డ్రెస్ వేసుకొని అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో ఒకటి వైరల్ కాగా అది డీప్ ఫేక్ వీడియో అనే విషయం సంచలనంగా మారింది. ఇప్పుడు మరోసారి కూడా డీప్ ఫేక్ ఉపయోగించే వారికి ఆలియా భట్ టార్గెట్‌గా మారింది.


ప్రభుత్వం చర్యలు..


మళ్లీ మళ్లీ డీప్ ఫేక్ టెక్నాలజీకి ఆలియా భటే బలవుతుండగా.. తన ఫ్యాన్స్ అంతా ఈ విషయంపై ఘాటుగా స్పందిస్తున్నారు. ఏఐ అనేది రోజురోజుకీ డేంజర్‌గా మారుతుందని, తమకు కూడా ఏఐ అంటే భయమేస్తుందని అంటున్నారు. ఏఐ అనేది ప్రమాదకరంగా మారుతుందని తెలుసుకున్న ప్రభుత్వం సైతం ఈ టెక్నాలజీని తప్పుగా ఉపయోగిస్తున్నవారిపై చర్యలు తీసుకోవడానికి ముందుకొచ్చింది. డీప్ ఫేక్ వీడియోలను క్రియేట్ చేసి దానిని వైరల్ చేసేవారికి రూ.1 లక్ష జరిమానాతో పాటు మూడేళ్లు జైలు శిక్ష విధించాలని ఆదేశించింది. కానీ ఈ వీడియోలను ఎవరు తయారు చేస్తున్నారు, అవి ఎలా బయటికి వస్తున్నాయి అని కనుక్కోవడానికి పోలీసులకు పెద్ద టాస్క్‌గా మారింది.


Also Read: ఆ వీడియోపై రూ.100 కోట్లు ప‌రువు న‌ష్టం దావా వేసిన ర‌వీనా టాండ‌న్ - అది ఫేక్ పోస్టా?