టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అనుష్క ఈ మధ్యకాలంలో సినిమాలు చేయడం బాగా తగ్గించేసింది. గత కొంతకాలంగా ఆమె చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. తాజాగా అనుష్క నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సెప్టెంబర్ 7న విడుదల కాబోతోంది. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లో జాయిన్ అయింది అనుష్క. ఈ ప్రాజెక్టుతో మొదటిసారి మాలీవుడ్లోకి ఎంట్రీస్తోంది. అనుష్క నటిస్తున్న లేటెస్ట్ ఫాంటసీ హారర్ మూవీ 'కథనార్: ది వైల్డ్ సోర్సెరర్'. హీరో జయసూర్య పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లిమ్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.  రోజిన్ థామస్ దర్శకత్వంలో అనుష్క శెట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు ఈ గ్లింప్స్ ద్వారా మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.


అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మే కేరళ పూజారి కడమతుత్తు కథనార్ కథల ఆధారంగా ఈ సినిమాని తరకెక్కిస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన గ్లిమ్స్ ని పరిశీలిస్తే.. రెండు నిమిషాల నిడివితో సాగే ఈ గ్లిమ్స్ లో జయసూర్యను చర్చి అధికారులకు ఖైదీగా చూపించారు. జయ సూర్య తమ చర్చిని నాశనం చేసే కొన్ని దుష్టశక్తులను కలిగి ఉన్నాడని వాళ్లంతా నమ్ముతారు. మరోపక్క గ్రామస్తులు వ్యాధితో బాధపడుతున్నట్లు కూడా ఇందులో చూపించారు. ఇక ఈ గ్లింప్స్‌లో ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉంది. చివరిలో R.రామానంద్ రాసిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కాబోతుందని, అందులో ఒకటి 2024లో విడుదలవుతుందని మేకర్స్ వెల్లడించారు.


పలు యదార్థ ఘటనల స్ఫూర్తితో తెరకెక్కుతున్న ఈ హారర్ మూవీ కడమట్టు అనే ప్రాంతంలోని ఓ చర్చి ఫాదర్ జీవితం నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అనుష్క క్యారెక్టర్ 'అరుంధతి' మూవీ తరహాలో చాలా ఛాలెంజింగ్ గా ఉంటుందని అంటున్నారు. అయితే గ్లిమ్స్ లో ఎక్కడా అనుష్కని చూపించలేదు. కానీ ఇలాంటి ఒక సూపర్ నాచురల్ హారర్ సినిమాలో అనుష్క శెట్టి కూడా భాగం కావడం ఇప్పుడు సర్వత్ర ఆసక్తికరంగా మారింది. పాన్ ఇండియన్ భాషలతో కలిపి మొత్తం 14 భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. అంతేకాకుండా వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీని ఉపయోగించిన మొదటి ఇండియన్ మూవీ ఇదే కావడం విశేషం. మరి అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న మొదటి పాన్ వరల్డ్ మూవీ, ఆమెకి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.


ఇక అనుష్క నటించిన 'మిస్ షెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా విషయానికి వస్తే.. ఇందులో యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో మొదటిసారి జోడి కట్టింది అనుష్క. UV క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాని మహేష్ తెరకెక్కించారు. దాదాపు మూడేళ్ల తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి. 


Also Read : విజయ్ దేవరకొండ 'ఖుషి' రివ్యూ - అమెరికాలో సినిమా చూసిన ఆడియన్స్ ఏమంటున్నారంటే?



Join Us on Telegram: https://t.me/abpdesamofficial