చిన్న సినిమాలకు మంచి రిలీజ్ డేట్ దొరకడం అనేది ఎప్పుడూ సమస్యగానే ఉంటుంది. పెద్ద, మీడియం రేంజ్ మూవీస్ మధ్య సరైన స్లాట్ లభించడం అంత ఈజీ కాదు. అదే బిగ్ ప్రొడక్షన్ నుంచి వచ్చిన సినిమా అయితే విడుదలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మంచి తేదీ దొరకడమే కాదు, ఆశించిన స్క్రీన్స్ కూడా అందుబాటులోకి వస్తాయి. కానీ బ్యాక్ ఎండ్ లో బడా బ్యానర్స్ సపోర్ట్ ఉండి కూడా, మూడు సినిమాలు చాలా నెలలుగా విడుదలకు నోచుకోలేదు. అవే 'అన్నీ మంచి శకునములే', 'అహింస', 'నేను స్టూడెంట్ సర్'. అప్పుడెప్పుడో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రాలు ఎట్టకేలకు ఇప్పుడు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి.

 

సంతోష్ శోభన్, మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ''అన్నీ మంచి శకునములే''. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై ప్రియాంక దత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని గతేడాది క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ అనుకున్న టైంకి సినిమాని థియేటర్స్ లోకి తీసుకురాలేకపోయారు. అయితే ఐదు నెలలుగా మంచి డేట్ కోసం వేచి చూసి, ఇప్పుడు సమ్మర్ సీజన్ లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

'అన్నీ మంచి శకునములే' చిత్రాన్ని మే 18న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ట్రైలర్ ను లాంచ్ చేయించి, సినిమాపై జనాల్లో ఆసక్తిని కలిగించారు. నేచురల్ స్టార్ నాని, మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ చీఫ్ గెస్టులుగా రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. ఈ సినిమాలో ‘తొలిప్రేమ’ ఫేమ్ వాసుకి, వెన్నెల కిషోర్, రావు రమేష్, నరేష్, గౌతమి, రాజేంద్ర ప్రసాద్ ఇతర పాత్రలు పోషించారు. 

 

అలానే ఎన్నాళ్ళ నుంచో ఊరిస్తున్న దగ్గుబాటి వారసుడు అభిరామ్ డెబ్యూ మూవీ 'అహింస' కూడా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు చిన్న కొడుకు, హ్యాండ్సమ్ హంక్ రానా తమ్ముడైన అభిరామ్ ను క్రియేటివ్ డైరక్టర్ తేజ చేతుల మీదుగా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ లో పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతేడాది సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ యూత్ ఫుల్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ కు ఇన్నాళ్ళకు మోక్షం లభిస్తోంది.

 

'అహింస' సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ అయిందని, లాస్ట్ ఇయర్ ని 9-9-22న 9:09 గంటలకు ఫస్ట్ లుక్ ని వదిలి ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇదే క్రమంలో టీజర్, ట్రెయిలర్, సాంగ్స్ కూడా రిలీజ్ చేశారు. సినిమాని థియేటర్లలోకి తీసుకురావడానికి దీపావళి మొదలుకొని ప్రతీ సీజన్ లోనూ స్లాట్ కోసం ట్రై చేశారు. కానీ పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ దొరకలేదు. ఏప్రిల్ 7న విడుదల అని ప్రకటించినప్పటికీ, వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ మూవీ ఇప్పుడు రిలీజ్ కాబోతోంది. జూన్ 02న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించి, ప్రమోషన్స్ రీస్టార్ట్ చేశారు. అహింసా సిద్ధాంతాన్ని ఫాలో అయ్యే యువకుడిని హింస కలిసినప్పుడు ఏం జరుగుతుంది? అనే పాయింట్ మీద తేజ మార్క్ లవ్ స్టొరీగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారని తెలుస్తోంది. ఇందులో గీతిక హీరోయిన్ గా నటించగా, సదా కీలక పాత్ర పోషించింది.

 

ఇక నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో కొడుకు బెల్లంకొండ గణేష్ నటించిన 'నేను స్టూడెంట్ సర్!' చిత్రానికి కూడా విడుదల తేదీ దొరికింది. దగ్గుబాటి అభిరామ్ కి పోటీగా అదే జూన్ 2వ తేదీన రిలీజ్ చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడ మరో ఆసక్తిరమైన విషయం ఏంటంటే, దర్శకుడు తేజ శిష్యుడు రాఖీ ఉప్పలపాటి ఈ సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. అంటే గురు శిష్యులు ఇద్దరూ బాక్సాఫీసు బరిలో ఒకే రోజు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యారన్నమాట. 'నాంది' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎస్వీ2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రాబోతున్న చిత్రమిది. ఇందులో అవంతిక దాసాని హీరోయిన్ గా నటించగా, విలక్షణ నటుడు సముద్రఖని కీలక పాత్ర పోషించారు.

 


 

కారణాలు ఏవైతేనేం అశ్వినీ దత్, సురేశ్ బాబు, బెల్లంకొండ సురేష్ వంటి అగ్ర నిర్మాతల సపోర్ట్ ఉన్నా కూడా, ఈ మూడు చిత్రాలు మంచి డేట్ కోసం ఇన్నాళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. పెద్ద సినిమాల రిలీజులు లేకపోవడంతో ఇప్పుడు థియేటర్లలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. మరి ఈ చిత్రాలు వాళ్లకి ఎలాంటి ఫలితాన్ని అందిస్తాయో చూడాలి.