Ankith's Beauty Trailer Review: క్యాబ్ నడుపుకొనే ఓ మధ్య తరగతి తండ్రి. అతను ప్రాణంగా ప్రేమించే కూతురు. మధ్యలో ఓ లవర్. సాఫీగా సాగుతున్న జీవితంలో అమ్మాయి మిస్ కావడంతో ఆ తల్లిదండ్రులు పడే ఆవేదన. వారితో పాటే తాను ప్రేమించిన అమ్మాయి ఎక్కడ ఉందో తెలియక సతమతమయ్యే లవర్. కట్ చేస్తే అమ్మాయి మిస్ కావడానికి అతనే కారణమంటూ అరెస్ట్ చేసిన పోలీసులు. కట్ చేస్తే 'బ్యూటీ' ట్రైలర్.

అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటించిన 'బ్యూటీ' మూవీ ట్రైలర్‌ను యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య చేతుల మీదుగా తాజాగా రిలీజ్ చేశారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకుంటుండగా... ట్రైలర్ మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. ఫాదర్ డాటర్ మధ్య అనుబంధం, ఎమోషన్, లవ్ స్టోరీ అన్నింటినీ కలగలిపి రియల్ లైఫ్ సంఘటనల ఆధారంగా మూవీని తెరకెక్కించారు.

లవ్ స్టోరీతో స్టార్ట్ అయి...

ఓ అందమైన లవ్ స్టోరీతో ప్రారంభమైన ట్రైలర్ ఆ తర్వాత ఫాదర్, డాటర్ ఎమోషన్స్, మధ్య తరగతి అనుబంధాలు, ఆ తర్వాత సస్పెన్స్ మోడ్‌లోకి వెళ్తుంది. 'ఎప్పుడన్నా నేను నిన్ను కోప్పడితే నన్ను అలా వదిలిపెట్టి వెళ్లిపోకు. నిన్ను వదిలేయడమంటే ఊపిరి వదిలేయడమే కన్నా.' అంటూ లవ్ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం కాగా... ఆ తర్వాత తండ్రీ కూతుళ్ల ఎమోషన్‌, మిడిల్ క్లాస్ కష్టాలను టచ్ చేస్తూ చూపించడం ఆకట్టుకుంటోంది.

తన బర్త్ డేకు బైక్ కొనిస్తానని మాటిచ్చి కొనివ్వలేని తండ్రిని నిలదీసిన కూతురికి... 'మీ నాన్న క్యాబ్ డ్రైవర్ అమ్మా. కలెక్టర్ కాదు.' అంటూ తల్లి చెప్పడం దానికి ఆ కూతురు 'మరి క్యాబ్ డ్రైవర్ అలా ఉండాలి కదా కలెక్టర్‌లా ప్రామిస్‌లు చేయకూడదు.' అంటూ కూతురు చెప్పడం మిడిల్ క్లాస్ బాధలను చూపించారు. ఆ తర్వాత కూతురు మిస్ కావడం, అమ్మాయి కోసం ఆ తండ్రి పడే ఆవేదన, తన కూతురిని మిస్సింగ్ వెనుక లవర్ ఉన్నాడని అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడం ఇలా సస్పెన్స్‌తో ఎండ్ చేశారు. దీన్ని బట్టి ఓ కంప్లీట్ యూత్ ఫుల్ లవ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'బ్యూటీ' అని తెలుస్తోంది.

Also Read: విజువల్ వండర్ మహావతార్ నరసింహ @ 50 డేస్ - టికెట్ బుకింగ్స్‌కు నో బ్రేక్... డిలీటెడ్ సీన్ చూశారా?

ఈ నెల 19న రిలీజ్

అంకిత్, నీలఖిలతో పాటు నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితన్ ప్రసన్న, మురళీధర్ గౌడ్, ప్రసాద్ బెహర తదితరులు కీలక పాత్రలు పోషించారు. గీతా సుబ్రహ్మణ్యం, హలో వరల్డ్, భలే ఉన్నాడే ఫేం జెఎస్ఎస్ వర్దన్ దర్శకత్వం వహించగా... స్టోరీ స్క్రీన్ ప్లే బాధ్యతల్ని ఆర్వీ సుబ్రహ్మణ్యం నిర్వహించారు. వానరా సెల్యులాయిడ్, మారుతీ టీం ప్రొడక్ట్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా... అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ నెల 19న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.