Mahavatar Narasimha Movie Completed 50 Days: ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద రీసెంట్‌గా సంచలన విజయం సాధించిన మూవీ అంటే మనకు గుర్తొచ్చేది 'మహావతార్ నరహింహ'. అశ్వినీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ డివోషనల్ యానిమేటెడ్ మూవీ విడుదలై ఇన్ని రోజులైనా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ థియేటర్లకు క్యూ కడుతున్నారు.
50 రోజులు కంప్లీట్
జులై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ విజువల్ వండర్ తాజాగా 50 రోజులు కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్ నడుస్తోన్న క్రమంలో ఓ మూవీ దాదాపు 200 థియేటర్స్‌కు పైగానే 50 రోజులు పూర్తి చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచి ఇదే జోష్ ఉందన్న మూవీ టీం డిలీటెడ్ వీడియోను షేర్ చేసింది. హిరణ్యకశిపుడు తన అంతరాత్మతో మాట్లాడుతూ ఆగ్రహావేశాలకు లోనైన ఆ సీన్ ఆకట్టుకుంటోంది.
టికెట్ బుకింగ్స్‌కు నో బ్రేక్
మూవీ రిలీజ్ అయ్యి 50 రోజులు దాటినా ఇప్పటికీ బుక్ మై షోలో టికెట్స్ బుక్ అవుతూనే ఉన్నాయి. ప్రతీ రోజూ దాదాపు 10 వేలకు పైగా టికెట్స్ సేల్ అవుతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ 50 రోజుల్లో ఓన్లీ యాప్ ద్వారానే దాదాపు 67 లక్షలకు పైగా టికెట్స్ కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకూ దాదాపు రూ.340 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ వెల్లడించారు. దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ మూవీగా రికార్డు క్రియేట్ చేసినట్లు చెప్పారు. ఆ జోష్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ 'హోంబలే ఫిల్మ్స్' మహావతార్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఈ మూవీని తెరకెక్కించారు.
విష్ణుమూర్తి 10 అవతారాలకు సంబంధించి యానిమేటెడ్ మూవీస్ నిర్మించనున్నట్లు 'హోంబలే' సంస్థ ఇదివరకే ప్రకటించింది. ఈ ఫ్రాంచైజీలో రెండో మూవీ 'మహావతార్: పరశురామ' (Mahavatar Parashuram) త్వరలోనే రానున్నట్లు డైరెక్టర్ అశ్విని కుమార్ తెలిపారు. ఫస్ట్ మూవీ 'నరసింహ'ను మించి ఈ మూవీ ఉంటుందని... 2027లో ఈ మూవీ రిలీజ్ కానుందని చెప్పారు. ప్రతీ రెండేళ్లకు ఓ ప్రాజెక్ట్ చొప్పున 2037 వరకూ మూవీస్ ఉంటాయని వెల్లడించారు. 2029లో మహావతార్: రఘునందన్, 2031లో మహావతార్: ద్వారకాదీశ్, 2033లో మహావతార్: గోకులానంద్, 2035లో మహావతార్: కల్కి 1, 2037లో మహావతార్: కల్కి 2 మూవీస్ ఉంటాయని తెలిపారు. ఇప్పటి జనరేషన్‌కు పురాణాలు, ఆధ్యాత్మికత, భక్తి భావం పెంచేలా శ్రీ మహావిష్ణువు అవతారాలను యానిమేటెడ్ రూపంలో అందిస్తుండడంపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.