‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమా ఈ నెల 6వ తేదీన విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పబ్లిసిటీ కోసం హీరో విశ్వక్ సేన్ తాజాగా ఓ ప్రాంక్ వీడియోను వదిలాడు. అయితే, అది పెద్ద వివాదమై కూర్చొంది. రోడ్డుపై ఆ న్యూసెన్స్ ఏమిటని కొందరు, ఆత్మహత్యలను ప్రోత్సాహిస్తున్నావా? అని మరికొందరు విశ్వక్ సేన్‌ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీనిపై అరుణ్ కుమార్ అనే అడ్వకేట్.. విశ్వక్ సేన్ మీద హెచ్ఆర్‌సిలో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అభిమాని సూసైడ్ పేరుతో ప్రాంక్ వీడియో చేసిన విశ్వక్ మీద చర్యలు తీసుకోవాలని ఆయన కోర్టును కోరినట్లు సమాచారం.


దీనిపై ఒక టీవీ ఛానల్ చర్చ పెట్టింది. ఈ విషయం తెలిసి విశ్వక్ సేన్ నేరుగా ఆ చానల్ స్టూడియోలోకి వెళ్లాడు. స్టూడియోలో ఉన్న ఆ చానల్  మహిళా యాంకర్‌తో విశ్వక్ సేన్ వాదనకు దిగాడు. అది కాస్త.. చిలికి చిలికి గాలివానలా మారింది. దీంతో యాంకర్.. విశ్వసేన్‌ను ‘గెట్ అవుట్’ అని అరిచింది. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ ‘F***’ వర్డ్ ఉపయోగించాడు. లైవ్‌లో ప్రసారమైన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


మహిళా యాంకర్‌ను ఆ దారుణమైన పదంతో తిట్టడం ఏమిటని మహిళా సంఘాలు మండిపడ్డాయి. దీనిపై ఆ చానెల్‌లో డిబేట్ కూడా నడించింది. విశ్వక్ సేన్ చేష్టలను విరామం లేకుండా ఆ చానల్ కడిగిపాడేస్తోంది. మరోవైపు ఆ టీవీ యాంకర్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఆశ్రయించింది. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ.. ‘‘వారి చర్చను చూశాను. అతని ప్రవర్తన బాగోలేదు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మహిళలను అవమానించడం మంచిది కాదు. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, పోలీస్ డిపార్ట్‌మెంట్ తీసుకోవల్సిన చర్యలపై మాట్లాడతాను. ఆ తర్వాత అతడు ప్రెస్‌తో మాట్లాడుతూ సారి చెప్పిన విధానం కూడా బాగోలేదు. మహిళతో గౌరవ మర్యాదాలు లేకుండా మాట్లాడటం బాధకరమైన విషయం’’ అని అన్నారు. 


Also Read: విశ్వక్ సేన్-టీవీ యాంకర్ గొడవపై ఆర్జీవీ ట్వీట్, ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటీ?


ఆ టీవీ చానల్ స్టూడియో జరిగిన విషయంపై విశ్వక్ సేన్ విలేకరులతో మాట్లాడుతూ... ‘‘దెబ్బ తగిలినప్పుడు అమ్మా అన్నట్టే.. ఆ పదం(F***) అలా వచ్చింది. ఇప్పట్లో పిల్లలకు, యూత్‌కు వద్దన్నా ఆ పదం వచ్చేస్తోంది. కానీ మీడియాలో ఆ వర్డ్ వాడినందుకు క్షమించాలి’’ అని అన్నాడు. దీనిపై తన సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇస్తానన్న విశ్వక్ సేన్ ఇప్పటివరకు స్పందించలేదు. అయితే, మంత్రి తలసాని నుంచి ఆదేశాలు వస్తే.. విశ్వక్ సేన్‌పై చర్యలు తీసుకొనే అవకాశాలుంటాయని తెలుస్తోంది. దీనిపై ఇంకా స్పష్టత రావలసి ఉంది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ట్రెండ్ వేరేగా ఉంది. ఎక్కువ మంది ఆ యాంకర్‌ను, చానెల్‌‌ను ట్రోల్ చేస్తున్నారు. ఇందులో ఇద్దరిదీ తప్పుందని అంటున్నారు. మరికొందరు విశ్వక్ సేన్‌ను తప్పుబడుతున్నారు. మహిళా యాంకర్‌తో మాట్లాడేప్పుడు కాస్త విచక్షణతో ఉండాల్సిందని విశ్వక్ సేన్‌కు హితవు చెబుతున్నారు. ‘F***’ వర్డ్ వాడి క్షమించరాని తప్పు చేశాడని అంటున్నారు. 


Also Read: పబ్లిసిటీ పేరుతో రోడ్డు మీద రచ్చ ఏమిటి? విశ్వక్ సేన్ మీద కంప్లైంట్ చేసిన లాయర్