సన్నీ డియోల్, అమీషా పటేల్ జంటగా నటించిన 'గదర్ 2' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. షారుక్ ఖాన్ 'పఠాన్' తర్వాత ఈ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ చిత్రంగా 'గదర్ 2' నిలిచింది. సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో మూవీ టీమ్ అంతా సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో హీరోయిన్ అమీషా పటేల్ శృంగార సన్నివేశాలు, కిస్ సీన్స్ చేయడంపై స్పందించింది. అలాంటి సన్నివేశాలు చేయడం తనకు అసలు నచ్చదని, అంత సౌకర్యంగా అనిపించదని వెల్లడించింది.


తాజాగా ఓ బాలీవుడ్ మీడియా ఇంటర్వ్యూలో అమీషా మాట్లాడుతూ.. "నేను స్క్రీన్ పై ముద్దు సన్నివేశాల్లో నటించనని సల్మాన్ ఖాన్ ఎలా అయితే చెబుతుంటారో, సన్నీడియోల్ కూడా దాన్ని ఫాలో అవుతుంటారు. నాది కూడా అదే రూల్. మన పర్సనాలిటీ మనకు ఎంతవరకు సౌకర్యంగా ఉంటుందో అక్కడికే హద్దులు పెట్టుకోవాలి. కాబట్టి నేను హాట్ గా కనిపించడం నాకు ఇష్టం లేదు. అలాగే శృంగార సన్నివేశాలు చేయడం నాకు సౌకర్యంగా అనిపించదు. వివిధ రకాల దుస్తులు ధరించడం కూడా సౌకర్యంగా ఉండదు. స్క్రీన్ పై బూతులు మాట్లాడడం, ముద్దు పెట్టుకోవడం.. ఇలాంటివన్నీ నాకు ఏమాత్రం కంఫర్టబుల్ గా అనిపించవు. అందుకే నేను ఇలాంటి సన్నివేశాల్లో నటించను" అంటూ చెప్పుకొచ్చింది. దీంతో అమీషా పటేల్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.


ఇక ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'గదర్ 2'.. 'గదర్' ఏక్ ప్రేమ్ కథ అనే చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కింది. 1971 ఇండో - పాక్ వార్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుంది. ఇందులో సన్నీ డియోల్ తారా సింగ్ పాత్రలో, అమీషా పటేల్ అతని భార్య సకీనా పాత్రలో నటించింది. ఉత్కర్ష్ శర్మ సన్నీడియోల్ కొడుకు పాత్రను పోషించారు. ఉత్కర్ష్ శర్మ 2001లో వచ్చిన 'గదర్' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఇండో - పాక్ యుద్ధ సమయంలో పాకిస్తాన్లో చిక్కుకున్న తన కొడుకును కాపాడడం కోసం తండ్రి తార సింగ్ గా సన్నీ డియోల్ ఈ చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచారు. 


మరోవైపు బాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇప్పటికే అక్షయ్ కుమార్, కార్తీక్ ఆర్యన్ లాంటి సెలబ్రిటీస్ ఈ సినిమాపై హర్షం వ్యక్తం చేయగా, రీసెంట్ గా బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరణ్.. ‘‘గదర్ 2 సినిమా చూసి మైండ్ బ్లాక్ అయింది. సినిమా అందరి మనసులు చేదిరేలా చేసింది. ఈ సినిమాను నేను సింగిల్ స్క్రీన్ లో చూసి ఎంతో ఆనందించాను. 2023 లో ఈ సినిమా రికార్డులు బద్దలు కొడుతుంది’’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా 'గదర్ 2' ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.400 కోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది.


Also Read : ఉగాండానూ ఊపేస్తున్న తమన్నా సాంగ్ - ‘కావాలయ్య’ను రీక్రియేట్ చేసిన చిన్నారులు, వీడియో వైరల్



Join Us on Telegram: https://t.me/abpdesamofficial