Mangalavaram producer Swathi Reddy interview : ఇండస్ట్రీలో న్యూ ఏజ్ ఫిలిం మేకర్స్ అని కొందరిని అంటుంటారు. స్వాతి రెడ్డి గునుపాటిని న్యూ ఏజ్ ప్రొడ్యూసర్ అనాలి. మెగా, అల్లు కుటుంబాలతో ఆమె కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తనకున్న పరిచయాలతో స్టార్ హీరోలతో స్వాతి రెడ్డి సినిమాలు తీసే వీలుంది. కానీ, 'మంగళవారం' అంటూ డార్క్ థ్రిల్లర్ సినిమా తీశారు. నవంబర్ 17న పాన్ ఇండియా రిలీజ్ కానున్న నేపథ్యంలో స్వాతి రెడ్డి మీడియా ముందుకొచ్చారు. 


స్టార్ హీరోలతో కాకుండా తొలి ప్రయత్నంగా డిఫరెంట్ సబ్జెక్ట్ ఎంపిక చేసుకుని సినిమా ఎందుకు చేశారు? అని స్వాతిని అడిగితే తనకు స్నేహాన్ని, వ్యాపారాన్ని ముడిపెట్టడం ఇష్టం లేదన్నారు. ''అర్జున్, చరణ్ నాకు ఫ్రెండ్స్. మా ఫ్యామిలీస్ మధ్య ఫ్రెండ్షిప్ ఉంది. నేను అడిగితే వాళ్ళు సినిమా చేస్తారు. అలాగని, నాతో సినిమా చేయమని వాళ్ళను అడగలేను. ముందు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. ప్రస్తుతం వాళ్ళ వల్ల సినిమాలతో బిజీగా ఉన్నారు. వాళ్ళకు తగ్గ కథ కుదిరినప్పుడు నేను అడుగుతా'' అని చెప్పారు. 


సినిమా ప్రొడ్యూస్ చేయాలనేది తనకు ఎప్పటి నుంచో ఉన్న డ్రీమ్ అని స్వాతి చెప్పారు. సురేష్ వర్మతో కలిసి ప్రొడ్యూస్ చేయడం వెనుక, 'మంగళవారం' తొలి సినిమాగా నిర్మించడం వెనుక అల్లు అర్జున్ ప్రోత్సాహం ఉందని చెప్పారామె. ''నాకు సురేష్ గారు 'మా టీవీ'లో ఉన్నప్పటి నుంచి తెలుసు. ఆయనకు కూడా ప్రొడ్యూస్ చేయాలని డ్రీమ్ ఉంది. మేం కథలు వింటూ ఉన్నాం. ఒక రోజు బన్నీతో మాట్లాడుతున్నప్పుడు 'ఎందుకు నీ కలను కలగా వదిలేయాలి. నువ్ సినిమా చెయ్. చేసినప్పుడు నీతో ఎవరైనా పార్ట్నర్ ఉండేలా చూసుకో' అన్నాడు. ఇక ముందడుగు వేయాలని అనుకున్నప్పుడు సురేష్ వర్మ గారు అజయ్ భూపతి కథ గురించి చెప్పారు. నాకూ నచ్చింది. ప్రొడ్యూస్ చేయాలని ఫిక్స్ అయ్యా. బన్నీ కూడా కథ విని బావుందని చెప్పడంతో మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది. ముందడుగు వేశా'' అని స్వాతి రెడ్డి వివరించారు.     


తొలుత తాను సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న విషయం ఎవరితోనూ చెప్పలేదని స్వాతి తెలిపారు. ''స్వాతి రెడ్డి నిమ్మగడ్డ అంటే గుర్తు పట్టేవారు ఏమో!? పెళ్లి తర్వాత మా ఆయన ప్రణవ్ ఇంటి పేరు గునుపాటిని నా పేరు చివర చేర్చాను. స్వాతి రెడ్డి గునుపాటి అని ఉండటంతో పోస్టర్ విడుదల తర్వాత మెస్సేజెస్ ఏం రాలేదు. టీజర్ నాన్నకు చూపించా. ఆయన పేరు చూసి సర్‌ప్రైజ్ అయ్యారు. తర్వాత అందరికీ చెప్పా. సర్‌ప్రైజ్ అయ్యారు. నాకు ఎంతో సపోర్ట్ చేశారు'' అని స్వాతి చెప్పారు. చిరంజీవి ట్రైలర్ విడుదల చేయడం ఎమోషనల్ మూమెంట్ అన్నారు. ఆయనను కలిసినప్పుడల్లా 'నువ్వు మీ నాన్నలా వ్యాపారాలు చేస్తుంటావ్' అని ఎంకరేజ్ చేస్తారని చిరుతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 


మహిళలకు సంబంధించిన ఒక సమస్యను అజయ్ భూపతి 'మంగళవారం'లో డిస్కస్ చేశారని, అన్ని వర్గాల ప్రేక్షకులకు అది నచ్చుతుందని స్వాతి అన్నారు. డార్క్ థ్రిల్లర్ సినిమా అయినప్పటికీ... 'మంగళవారం' సినిమాలో మంచి మ్యూజిక్, ఎమిషన్స్, ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ వంటి కమర్షియల్ అంశాలు అన్నీ ఉన్నాయని సురేష్ వర్మ చెప్పారు. అజయ్ భూపతి సొంతంగా సినిమా ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటే తాను అడగంతో తమతో చేశాడని చెప్పారు. తాను చిన్నతనం నుంచి చిరంజీవి వీరాభిమానిని అని, ఆయన్ను ఒక్కసారి కలిస్తే చాలని అనుకున్నానని, ఇవాళ తమ తొలి సినిమా ట్రైలర్ ఆయన చేతుల మీదుగా విడుదల కావడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని చెప్పారు.  


Also Read : స్వాతి కోసం బెంగళూరు కాలేజీకి వెళ్ళిన బన్నీ - అప్పుడు ఏం జరిగిందంటే?  
 
అజయ్ భూపతి దర్శకత్వంలో ఆయనకు చెందిన 'ఏ' క్రియేటివ్ వర్క్స్‌, ముద్ర మీడియా పతాకంపై ఎం. సురేష్ వర్మతో కలిసి స్వాతి రెడ్డి గునుపాటి ఈ సినిమా నిర్మించారు. విడుదలకు ముందు సినిమాపై విపరీతమైన బజ్ నెలకొంది. అది సంతోషాన్ని కలిగిస్తోందని స్వాతిరెడ్డి చెప్పారు. పాయల్, అజ్మల్ ఆమీర్, శ్రీతేజ్, రవీందర్ విజయ్, నందితా శ్వేతా, అజయ్ ఘోష్ తదితరులు నటించిన ఈ సినిమా నవంబర్ 17న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అవుతోంది.


Also Read సంక్రాంతి బరిలో మామా అల్లుళ్ళ మధ్య పోటీనా? మాజీ భార్య భర్తల మధ్య పోటీనా?