ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun Arrest) అరెస్ట్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సంచలనం అయ్యింది. థియేటర్ దగ్గర జరిగిన తోపులాటలో ఒక మహిళ మృతి చెందగా దానికి హీరోని ఒక్కరినే బాధ్యుడిని చేస్తూ ఎలా అరెస్ట్ చేస్తారని సెలబ్రిటీలు నివ్వెరపోయారు.
'పుష్ప 2' సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించిన రష్మికతో పాటు యువ హీరోలు నాని, నితిన్, సందీప్ కిషన్ సహా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఇంకా నటుడు బ్రహ్మాజీ, దర్శకులు అనిల్ రావిపూడి, అజయ్ భూపతి తదితరులు తమ స్పందన వ్యక్తం చేశారు. ఇంతకీ వాళ్ళు ఏమన్నారు? అరెస్టు పట్ల ఏ విధంగా స్పందించారు అనేది చూస్తే...
ఒక వ్యక్తిని నిందించడం సరికాదు - నాని
''చలనచిత్ర పరిశ్రమకు వ్యక్తులకు సంబంధించిన ఏ విషయంలో అయినా ప్రభుత్వ అధికారులు, మీడియా చూపించే ఉత్సాహం సగటు సాధారణ పౌరులపై కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మనమంతా మంచి సమాజంలో జీవించాలి'' అని నాని అన్నారు. థియేటర్ దగ్గర జరిగిన పరిణామాల కారణంగా ఒక మహిళ మృతి చెందడం దురదృష్టకర, హృదయ విదారకర ఘటనగా ఆయన పేర్కొన్నారు. ఇంకా నాని మాట్లాడుతూ ''ఇటువంటి ఘటనల నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. భవిష్యత్తులో ఈ విధంగా జరగకుండా జాగ్రత్తలు పాటించడంతో పాటు చర్యలు తీసుకోవాలి. ఇక్కడ అందరి తప్పు ఉంది ఒక వ్యక్తిని నిందించడం సరికాదు'' అని చెప్పారు.
హీరోయిన్ రష్మిక మందన్న సైతం ఒక వ్యక్తిని నిందించడం సబబు కాదంటూ సోషల్ మీడియా వేదికగా తన స్పందన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను తాను నమ్మలేకపోతున్నానని థియేటర్ దగ్గర ఘటన దురదృష్టకరమని, అది తన హృదయాన్ని ఎంతగానో కలచివేస్తోందని ఆవిడ తెలిపారు.
అటువంటి ఘటనలు ఎలా అరికట్టాలో ఆలోచించాలి - నితిన్
థియేటర్ దగ్గర జరిగిన ఘటన బాధాకరమని చెప్పిన హీరో నితిన్... అటువంటి ఘటనలు మరోసారి పునరావృత్తం కాకుండా వాటిని ఎలా నిరోధించాలనే దాని గురించి ఆలోచించాలని ఆయన సూచించారు. మరో యువ కథానాయకుడు సందీప్ కిషన్ ''ఎవరు ఊహించని ఘటనలో ఒక వ్యక్తి ఎలా బాధ్యత వహించగలరు? మనమంతా ఈ ఘటన నుంచి నేర్చుకోవాలని, ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలి'' అని పేర్కొన్నారు.
మెరుగైన భద్రత అవసరం - దర్శకుడు అనిల్ రావిపూడి
సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన బాధాకరమైన దర్శకుడు అనిల్ రావిపూడి... ఇటువంటి ఘటనలు మనకు మరింత మెరుగైన భద్రత అవసరమనే అంశాన్ని గుర్తు చేస్తుందని తెలిపారు. ''అల్లు అర్జున్ ఒక్కరినే బాధ్యత వహించమని అడగడం సరి కాదు'' అని ఆయన పేర్కొన్నారు. మరోసారి ఈ విధంగా జరగకుండా చూసుకుందామని తెలిపారు.
Also Read: మిస్ యు రివ్యూ - సిద్ధార్థ్ సినిమాకు ఆడియన్స్ వస్తారా? వచ్చేలా ఉందా? పుష్ప 2 ఎఫెక్ట్ ఉంటుందా?
సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన, అల్లు అర్జున్ అరెస్టు పట్ల బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్ పరోక్షంగా స్పందించారు. భద్రతా పరమైన అంశాలను నటీనటులు మాత్రమే చూసుకోలేరని, జాగ్రత్తగా ఉండాలని మాత్రమే చుట్టుపక్కల ఉన్న వారందరికీ సూచిస్తుంటారని, ఆ విషయంలో ఒక వ్యక్తిని మాత్రమే నిందించడం అన్యాయమని ఆయన తెలిపారు.
Also Read: అప్పుడు 'రూలర్' vs 'ప్రతిరోజూ'... నెక్స్ట్ ఇయర్ 'అఖండ 2' vs 'సంబరాల ఏటిగట్టు'