సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ లో ఒకటిగా పేరుగాంచిన ట్విట్టర్ కి పోటీగా మార్క్ జుకర్ బర్గ్ నేతృత్వంలో మెటా సంస్థ ఓ సరికొత్త యాప్ ని తీసుకొచ్చింది. 'థ్రెడ్స్' పేరుతో రూపొందిన ఈ సరికొత్త టెక్స్ట్ ఆధారిత యాప్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఇండియాతో పాటు పలు దేశాల్లో ఇప్పటికే ఈ యాప్ ని వినియోగదారులు యూజ్ చేస్తున్నారు. ఈ యాప్ ని ప్రారంభించిన మొదటి రెండు గంటల్లోనే ఏకంగా 20 లక్షల మంది ఈ యాప్ లో అకౌంట్ ఓపెన్ చేశారు. ఆ తర్వాత మరో రెండు గంటల్లో 30 లక్షల మంది ఓపెన్ చేయగా.. అలా కేవలం 7 గంటల్లోనే 10 మిలియన్ల అకౌంట్స్ ఓపెన్ అయ్యాయి. అయితే సామాన్లతో పాటు ఇప్పుడు సినీ సెలబ్రిటీలు సైతం ఈ సరికొత్త సోషల్ మీడియా ఆప్ లో అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు.


ఇక ఈ కొత్త సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ని స్వీకరించిన మొదటి తెలుగు హీరోలుగా అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ నిలిచారు. బన్నీ, తారక్ ఇద్దరు తాజాగా 'థ్రెడ్స్' యాప్ లో అకౌంట్ ఓపెన్ చేయగా.. ఇప్పటివరకు ఇందులో ఎలాంటి పోస్టులు పెట్టలేదు. ఇక అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇద్దరూ సరికొత్త సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చారనే వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక బన్నీకి ఇప్పటికే ట్విట్టర్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్స్ ఉండగా.. ఈ రెండిట్లోనూ బన్నీకి భారీ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో బన్నీ అత్యధిక ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీగా సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. ఇప్పటివరకు అల్లు అర్జున్ కి ఇన్ స్టాగ్రామ్ లో 21 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అటు ట్విట్టర్ లో కూడా 8 మిలియన్ల ఫాలోవర్స్ ని కలిగి ఉన్నారు.


ఇక తారక్ కి ఇన్ స్టాగ్రామ్ లో 6.5 మిలియన్ ఫాలోవర్స్, అలాగే ట్విట్టర్లో 7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కిస్తున్న 'పుష్ప 2' షూటింగ్ తో బిజీగా ఉన్నారు బన్నీ. 'పుష్ప పార్ట్ 1' ని మించి పార్ట్ 2 ని రూపొందిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ పాన్ వరల్డ్ స్థాయిలో నిర్మిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక 'పుష్ప 2' తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు బన్నీ. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికీ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. బన్నీ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతోంది.


ఇక ఎన్టీఆర్ విషయానికొస్తే.. ప్రస్తుతం 'దేవర' షూటింగ్ తో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. రీసెంట్ గానే మేకర్స్ అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరించారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని మేకర్ పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read : తల్లి పరిస్థితి విషమంగా ఉన్నా షారుఖ్ ఖాన్ షూటింగ్‌కు వచ్చారు - ‘మాయా మేంసాబ్’దర్శకుడు


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.



Join Us on Telegram: https://t.me/abpdesamofficial