కామెడీ కింగ్ 'అల్లరి' నరేష్ (Allari Naresh) ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి రెడీ అయ్యారు. వినోదంతో విందు భోజనం పెట్టడానికి సిద్ధమయ్యారు. సీరియస్ సినిమాలు 'నాంది', 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం', 'ఉగ్రం'తో సోలో హీరోగా వరుస విజయాలు అందుకున్న ఆయన... మళ్లీ తన హోమ్ గ్రౌండ్ కామెడీకి వచ్చారు. 'నా సామి రంగ'లో వింటేజ్ నరేష్ సందడి చేశారు. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు'తో వేసవిలో వినోదం అందించడానికి వస్తున్నారు.
'ఆ ఒక్కటీ అడక్కు' విడుదల తేదీ ఫిక్స్!
'ఆ ఒక్కటీ అడక్కు' టైటిల్ వింటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది రాజేంద్ర ప్రసాద్ హీరోగా నరేష్ తండ్రి, దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన సినిమా. అది క్లాసిక్ అయ్యింది. ఆ పేరుతో నరేష్ సినిమా చేస్తుండటం, అదీ పెళ్లి సమస్య నేపథ్యంలో కావడంతో అంచనాలు పెరిగాయి. ఈ సినిమాను మే 3న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అతి పెద్ద డిస్ట్రిబ్యూషన్ హౌస్‌లలో ఒకటైన ఆసియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్ఎల్పీ 'ఆ ఒక్కటీ అడక్కు' పంపిణీ హక్కులను సొంతం చేసుకుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆ సంస్థ ద్వారా ఈ సినిమా విడుదల కానుంది.
'అల్లరి' నరేష్ సరసన ఫరియా అబ్దుల్లా!
హీరోగా 'అల్లరి' నరేష్ (Allari Naresh 61 Movie)కు 61వ చిత్రమిది. ఆల్రెడీ విడుదల చేసిన మూవీ గ్లింప్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. 'ఆ ఒక్కటీ అడక్కు' అంటే... ఏది అడక్కూడదు? అంటే... 'పెళ్లి ఎప్పుడు?' అని నరేష్ చెబుతున్నారు. ఈతరం యువత ఫేస్ చేస్తున్న పాన్ ఇండియా ప్రాబ్లమ్ పెళ్లి నేపథ్యంలో 'ఆ ఒక్కటీ అడక్కు' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో 'అల్లరి' నరేష్ సరసన 'జాతి రత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) నటిస్తున్నారు.
'ఆ ఒక్కటీ అడక్కు' సినిమాతో మల్లి అంకం దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చిలకా ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో లెజెండరీ కమెడియన్ జానీ లివర్ కుమార్తె జెమీ లివర్, 'వెన్నెల' కిశోర్, 'వైవా' హర్ష, అరియనా గ్లోరీ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read: శరవేగంగా సాగుతోన్న రవితేజ మల్టిప్లెక్స్ నిర్మాణాలు - ఎక్కడో తెలుసా?
ఈ చిత్రానికి కళా దర్శకుడు: జేకే మూర్తి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అక్షిత అక్కి, కూర్పు: ఛోటా కె ప్రసాద్, ఛాయాగ్రహణం: సూర్య, రచన: అబ్బూరి రవి, సంగీతం: గోపి సుందర్, సహ నిర్మాత: భరత్ లక్ష్మీపతి, నిర్మాత: రాజీవ్ చిలక, దర్శకత్వం: మల్లి అంకం.