Comedian Ali About Double Ismart: పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. 2019లో వీరి కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘ఇస్మార్ట్ శంకర్’కు ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. ఆగస్ట్ 15న ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. దీంతో హీరో రామ్‌తో పాటు హీరోయిన్ కావ్య థాపర్, కామెడియన్స్ అలీ, గెటప్ శ్రీను కలిసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూను విడుదల చేశారు. ‘డబుల్ ఇస్మార్ట్’లో అలీ క్యారెక్టర్ ఐడియా అసలు ఎలా వచ్చిందో ఈ ఇంటర్వ్యూలో బయటపెట్టారు అలీ.


మ్యానేజర్‌గా చింపాంజి..


పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించే దాదాపు ప్రతీ సినిమాలో అలీకి సెపరేట్ క్యారెక్టర్ ఉంటుంది. అలా వీరి కాంబినేషన్‌లో వచ్చిన క్యారెక్టర్స్ అన్నీ ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్ట్’లో కూడా అలీ కోసం అలాంటి ఒక వెరైటీ క్యారెక్టర్‌ను డిజైన్ చేశాడు పూరీ. ట్రైలర్‌లోనే ఆ క్యారెక్టర్ గ్లింప్స్‌ను ప్రేక్షకులకు చూపించాడు. అసలు ఆ క్యారెక్టర్ ఎలా క్రియేట్ అయ్యిందో తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో బయటపెట్టారు అలీ. ‘‘మలేషియాలో బిల్లా సినిమా చేశాం. ఒక చింపాంజీని మ్యానేజర్‌గా పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని క్రియేట్ చేశాను. సరదాగా ప్రభాస్‌తో పాటు అందరూ కూర్చొని ఉన్నప్పుడు చేసి చూపించాను’’ అని గుర్తుచేసుకున్నారు అలీ.


అప్పటికీ నవ్వుతూనే ఉన్నాడు..


తను అలా యాక్ట్ చేసి చూపించినప్పుడు అక్కడ ఉన్నవారంతా గంటన్నర సేపు కిందపడి మరీ నవ్వారని చెప్పుకొచ్చారు అలీ. ‘‘నేను జోక్ చెప్పేసి రూమ్‌కు వెళ్లిపోయాను. ఫోన్ ఆన్ చేసి పెడితే ప్రభాస్ అప్పటికీ నవ్వుతూనే ఉన్నాడు. అది పూరీకి చెప్పాను. ఇలా అనుకున్నామని చెప్పగానే ఈ ట్రాక్ బాగుంది. ఏ సినిమాలో అయినా పెడదాం అన్నాడు. సడెన్‌గా ఒకరోజు ఫోన్ చేసి అమెరికా నుండి దాన్ని తీసుకొస్తున్నాను అన్నాడు. ఎవరిని అని అడిగాను. అదే అమెజాన్ ఫారెస్ట్ నుండి ఆ క్యారెక్టర్ తీసుకొస్తున్నాను అన్నాడు. వెళ్లి ఆ గెటప్ చూడగానే నేను షాకయ్యాను. షూటింగ్ సమయంలో నేను తెలుగు డైలాగ్ చెప్తున్నప్పుడు అక్కడ ఉన్న జూనియర్ ఆర్టిస్టులకు భాష అర్థం కాకపోయినా.. ప్రతీ షాట్‌కు క్లాప్ కొట్టేస్తున్నారు’’ అని ‘డబుల్ ఇస్మార్ట్’లో తన క్యారెక్టర్ గురించి తెలిపారు అలీ.


మూడు గంటల్లో షూటింగ్..


‘‘పూరీ జగన్నాథ్ నా క్యారెక్టర్‌కు అక్కడి భాషలో డైలాగులు రాసి నాకు వివరించాడు. నాకు కూడా చాలాసేపు ఆ డైలాగులు నోరుతిరగలేదు’’ అని చెప్పారు అలీ. ఇక పూరీ జగన్నాథ్‌తో తను చేసిన ‘ఇడియట్‌ను గుర్తుచేసుకుంటూ ఆ సినిమాలో తన పార్ట్ మొత్తం 3 రోజుల్లో షూట్ చేశామని రివీల్ చేశారు. ‘‘ఆరోజు వర్షం పడుతుంది. ఒక రాయి కింద కూర్చొని ఉన్నాం. వెళ్లిపోదామనుకున్నాం. భోజనాలు వస్తున్నాయని ఆగాం. మధ్యాహ్నం 12.30కు వర్షం ఆగితే మొత్తం మూడు గంటల్లో షూటింగ్ చేసి 4 గంటలకు ప్యాకప్’’ అని తెలిపారు అలీ. ఆయన సినిమానే 3 రోజుల్లో రాస్తారని చెప్పి నవ్వాడు హీరో రామ్.



Also Read: పక్కోడు... పకోడీలు... పట్టించుకుంటే పనులు జరగవ్ - రామ్ సెన్సేషనల్ స్పీచ్