నందమూరి తారకరత్న ఇటీవలే గుండెపోటుకు గురై మరణించిన సంగతి తెలిసిందే. తారకరత్న మృతితో ఆయన కుటంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. దాదాపు 23 రోజుల ఆసుపత్రిలో చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. తారకరత్న ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు నందమూరి బాలకృష్ణ ఆయన ఆరోగ్య పరిస్థితి పై పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని పూజలు, యజ్ఞాలు చేయించారు బాలకృష్ణ. కానీ తారకరత్న తిరగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మరణాన్ని ఇప్పటికీ ఎవరూ మరవలేదు. అయితే తారకరత్న మృతి తర్వాత కూడా నందమూరి బాలకృష్ణ ఆ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. ఇటీవలే తారకరత్న మృతి చెంది నెల రోజులైన సందర్భంగా ఆయన భార్య అలేఖ్యారెడ్డి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. బాలకృష్ణ తన కుటుంబానికి చేసిన సాయాన్ని గుర్తు తెచ్చుకుని భావోద్వేగానికి గురైంది. తాము కుటుంబం అని పిలిచే ఏకైక వ్యక్తి బాలయ్య అని చెప్పింది అలేఖ్య. బాలకృష్ణ కూడా తారకరత్న కుటుంబానికి అండగా నిలబడ్డారు. అయితే తాజాగా బాలకృష్ణ తారకరత్న కోసం మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు.


ఆసుపత్రిలో ఒక బ్లాక్ కు తారకరత్న పేరు


తారకరత్న పేరు ప్రజల్లో ఎప్పటికీ అలాగే గుర్తుండిపోయేలా ఓ నిర్ణయం తీసుకున్నారు బాలయ్య. తన కుటుంబంలో వచ్చిన ఇలాంటి పరిస్థితి మరే కుటుంబంలో రాకూడదు అని ఆలోచన చేశారు. తారకరత్న పేరు మీద గుండె జబ్బులు ఉన్న పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆయన హిందూపురంలో నిర్మించిన హాస్పిటల్ లో హెచ్ బ్లాక్ కు తారకరత్న పేరు పెట్టారు. అంతే కాదు, నిరుపేదల వైద్యం కోసం రూ.1.30 కోట్లతో ఆపరేషన్ పరికరాలను ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. అలాగే ఆసుపత్రిలో చిన్న పిల్లలకు ఉచితంగా భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. వారికి కావాల్సిన మందులు కూడా మూడు నెలల పాటు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు బాలయ్య.  


నందమూరి తారకరత్న మరణం తర్వాత ఆయన భార్య అలేఖ్య రెడ్డి తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ప్రతి క్షణం భర్తను తలుచుకుని కన్నీటిపర్యంతమౌతున్నారు. తారకరత్న ను తలుచుకొని అప్పడప్పుడూ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టులు చేస్తున్నారు. ఈ పోస్ట్ లు చూసి ప్రతీ ఒక్కరూ  చలించిపోతున్నారు. ధైర్యంగా ఉండాలని చెబుతున్నారు. ఇక తారకరత్న కుటుంబానికి బాలకృష్ణ ముందునుంచీ అండగా ఉంటూ వస్తున్నారు. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 




కాగా, ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువైపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. కార్డియాక్ అరెస్టుతో మరణించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలోనే ఈ గుండెపోట్లు కనిపించేవి కానీ ఇప్పుడు 20 ఏళ్ల లోపు పిల్లలు కూడా కార్డియాక్ అరెస్ట్ కు గురవుతున్నారు. ఈ మధ్య కాలంలో  అలా ఎంతో మంది యువకులు మరణించారు. ఈ క్రమంలో పేద ప్రజలకు ఉచితంగా గుండె సంబంధిత ఆపరేషన్ లు చేయాలని బాలయ్య నిర్ణయం తీసుకోవడం చెప్పుకోదగ్గ విషయమని చర్చించుకుంటున్నారు ప్రజలు. 


Read Also: అద్భుతం, న్యూజెర్సీలో కార్ల లైట్లతో ‘నాటు నాటు’ ప్రదర్శన - వైరల్ అవుతోన్న టెస్లా వీడియో, డోన్ట్ మిస్!