టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘రంగమార్తాండ’. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్ సహా పలువురు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా, ఉగాది కానుకగా మార్చి 22న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ప్రేక్షకుల మనసును హత్తుకునేలా ఉంది ఈ ట్రైలర్.
ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తున్న ‘రంగమార్తాండ’ ట్రైలర్
ఈ సినిమాలో రంగస్థల నటుడి కష్ట సుఖాలను చూపిస్తూ కృష్ణవంశీ మార్క్ కనబర్చారు. తన కుటుంబ సభ్యులే పెద్దరికానికి ఎదురు తిరగడం ఈ ట్రైలర్ లో ఆవేదన కలిగిస్తుంది. తన కూతురే తనని దొంగ అని ముద్ర వేయడం అందరినీ కంట తడి పెట్టించింది. ఇంట్లో జరిగే అవమానాలను తట్టుకోలేని ఇంటి పెద్ద మనిషి, భార్యతో కలిసి మరో ప్రయాణాన్ని మొదలు పెట్టడం హృదయాన్ని ద్రవింపజేస్తోంది.
రంగస్థల కళాకారుడి కథ ఆధారంగా తెరకెక్కిన ‘రంగమార్తాండ’
ట్రైలర్ అంతా ఎమోషన్స్ తో నిండిపోయి కనిపించింది. జీవితంలో నటనను ప్రాణంగా భావించిన ఒక రంగస్థల కళాకారుడి అనుభవాలు, జ్ఞాపకాలను బేస్ చేసుకుని కృష్ణ వంశీ ‘రంగమార్తాండ’ సినిమాను రూపొందించారు. వ్యక్తి జీవితంలోని అనుభూతులు, భావోద్వేగాలకు పెద్ద పీట వేస్తూ ఈ సినిమా కథ ముందుకు నడుస్తోంది. ఇక ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం నటన మరో లెవల్ లో ఉంది. వారి యాక్టింగ్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన పలు అప్ డేట్స్ ప్రేక్షకులలో ఆసక్తి కలిగించాయి. ప్రస్తుతం వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. చాలా కాలం తర్వాత కృష్ణ వంశీ నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరాఠీ భాషలో తెరకెక్కించిన 'నటసామ్రాట్' సినిమా అక్కడ పెద్ద హిట్ అయింది. విమర్శకుల ప్రశంసలను దక్కించుకున్న సినిమా అది. దీంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు కృష్ణవంశీ. నాలుగేళ్ల క్రితమే సినిమాను మొదలుపెట్టారు. షూటింగ్ కంప్లీట్ అయినా, చాలా కాలంగా రిలీజ్ పై సస్పెన్స్ కొనసాగించారు. తాజాగా రిలీజ్ డేట్ అఫీషియల్ గా ప్రకటించారు ఇప్పటికే ఈ సినిమాకి ఓటీటీ రూపంలో మంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజే చేయడానికి రూ.20 కోట్లు ఆఫర్ చేసిందని తెలుస్తోంది. ‘రంగమార్తాండ’ చిత్రాన్ని కాలెపు మధు, వెంకట్ కలిసి నిర్మించారు. ఈ సినిమాకి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషించారు. ఉగాది కానుకగా మార్చి 22న విడుదల కానుంది.