Nellore CI Dies Of Heart Attack: ఉన్నట్టుండి హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్.. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అకాల మరణాలు పెరిగిపోతున్నాయి. పనిచేస్తూనో, విధి నిర్వహణలోనో, జిమ్ లో కసరత్తులు చేస్తూనో, డ్యాన్స్ చేస్తూ.. ఇలా ఉన్నట్టుండి సడన్ గా కొంతమంది యువతతో పాటు మధ్య వయసు వారు చనిపోయిన ఘటనలు ఇటీవల జరిగాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆత్మకూరు సీఐ మల్లి నాగేశ్వరరావు విధి నిర్వహణలోనే కన్నుమూశారు. 


ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల (AP MLC Elections) విధుల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారు సీఐ నాగేశ్వరరావు. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ సోమవారం మధ్యాహ్నం తన ఆఫీస్ లోనే గుండె నొప్పి అంటూ ఒక్కసారిగా కుప్పకూలారు. ఇది గమనించిన తోటి సిబ్బంది సీఐని ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆయనను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఐసీ నాగేశ్వరరావు చనిపోయారని నిర్థారించారు.  


పాఠాలు చెబుతూనే ఆగిన ఉపాధ్యాయుడి గుండె 
ఇటీవల బాపట్ల జిల్లాలో ఓ టీచర్ తరగతి గతిలో కుర్చీలోనే గుండెపోటుతో చనిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో సీఐ నాగేశ్వరరావు గుండెపోటుతో విధి నిర్వహణలోనే చనిపోవడం బాధాకరం. బాపట్ల జిల్లా చీరాల మండలంలో ఓ ఉపాధ్యాయుడు పాఠాలు చెబుతూనే మృతి చెందాడు. వాకావాకా వారి పాలెం ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ ఘటన జరిగింది. ఉదయం బడికి హుషారుగా వచ్చిన టీచర్‌ పాఠాలు చెబుతూనే గుండె ఆగిపోయింది. ఆయన కుర్చున్న చోటే కూలబడిపోయి కన్నుమూశారు. దీంతో ఉపాధ్యాయుడితోపాటు పాఠశాల ఉన్న ఊరిలో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి. 


కబడ్డీ ఆడుతూ ఫార్మసీ విద్యార్థి మృతి! 
ఇంటర్ విద్యార్థుల నుంచి 40 ఏళ్ల వయసు వరకున్న వాళ్లు ఎక్కువగా మృత్యువాత పడుతున్నారు మార్చి మొదటి వారంలో అనంతపురంలో బీ ఫార్మసీ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. 19 ఏళ్ల వయసు ఉన్న ఓ విద్యార్థి కబడ్డీ ఆడుతూ.. గ్రౌండ్ లోనే ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం పట్టణంలోని పీవీపీకే కళాశాలలో 19 తునూజ నాయక్ బీ ఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 1వ తేదీన కాళాశాల గ్రౌండ్ లో కబడ్డీ ఆడుతూ.. తనూజ నాయక్ గ్రౌండ్ లోనే హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. విషయం గుర్తించిన విద్యార్థులు, సిబ్బంది.. తనూజ నాయక్ ను వెంటనే బెంగళూరులోని ఎమ్మెస్ రామయ్య ఆస్పతత్రికి తరలించారు. ఇన్నాళ్లుగా చికిత్స పొందుతున్న తనూజ నాయక్ ఈరోజు తుదిశ్వాస విడిచాడు.


ఇటీవల హైదరాబాద్ లో ఓ కానిస్టేబుల్ వ్యాయామం చేస్తూ కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే ఏపీలో అలాంటి ఘటనే జరిగింది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ వ్యాయామం చేసేందుకు జిమ్ కు వెళ్లాడు. వర్కౌట్స్ చేస్తున్న సమయంలో అక్కడ కళ్లు తిరిగినట్లు అనిపించగా కొంత సమయానికే జిమ్ నుంచి బయటకు వచ్చేశాడు. అలా రాగానే ఆయనకు మూర్ఛ వచ్చింది. విషయం గుర్తించిన స్థానికులు సపర్యలు చేయగా.. స్పృహలోకి వచ్చాడు. ఈ క్రమంలో కార్డియాక్ అరెస్ట్ అయి కాసేపటికే ప్రాణాలు కోల్పోయాడు.