నిఖిల్ సిద్ధార్థ్. పెద్దగా పరిచయం అవసరం లేని నటుడు. ‘హైదరాబాద్ నవాబ్స్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. పాన్ ఇండియా రేంజికి చేరుకున్నాడు. ‘హ్యాపీ డేస్’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్, ఆ తర్వాత వరుస సినిమాలు చేశాడు. ‘కార్తికేయ’ సినిమాతో అద్భుత విజయాన్ని అందుకున్నాడు. మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. గతేడాది ‘కార్తికేయ 2’ మూవీతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాలో నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియా స్టార్ గా నిఖిల్ కు గుర్తింపు తెచ్చింది. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల ప్రేక్షకులను బాగా అలరించింది. టీవీతో పాటు ఓటీటీలోనూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.  


నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు


అద్భుత విజయాన్ని అందుకున్న ‘కార్తికేయ 2’ మూవీ ప్రతిష్టాత్మక అవార్డులను సైతం దక్కించుకుంటోంది. ఈ చిత్రంలో నటనకు గాను నిఖిల్ సిద్ధార్థ ఉత్తమ నటుడిగా ఐకానిక్ గోల్డ్ అవార్డును అందుకున్నాడు. బాలీవుడ్ లో ఇచ్చే ప్రముఖ  ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ 2023 వేడుక తాజాగా ముంబైలో ఘనంగా జరిగింది. 2022 గాను ‘కార్తికేయ 2’  సినిమాకి పాపులర్ ఛాయిస్ కేటగిరీలో బెస్ట్ యాక్టర్ గా నిఖిల్ కి అవార్డుని అందుకున్నాడు. ఈ సందర్భంగా సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు, అవార్డు అందించిన జ్యూరీ మెంబర్స్ కు నిఖిల్ ధన్యవాదాలు చెప్పారు.  






ఇస్కాన్ సంస్థ ప్రశంసించిన తొలి చిత్రం ‘కార్తికేయ 2’


‘కార్తికేయ 2’ సినిమాను చందు మొండేటి తెరకెక్కించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై.. విశ్వ ప్రసాద్ టీజీ వివేక్ కూచిభొట్ల అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. కృష్ణుడి లీలలు,  ఆయన గొప్పతనం గురించి వర్ణిస్తూ ‘కార్తికేయ 2’ను రూపొందించారు.  దక్షిణాది రాష్ట్రాల కంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. అంతే స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. ‘కార్తికేయ 2’ సినిమాను ఇస్కాన్  సంస్థ కూడా అద్భుతం అంటూ మెచ్చుకుంది. ‘కార్తికేయ 2’ చిత్ర బృందానికి ప్రశంసా పత్రం అందించింది. ఇస్కాన్ సంస్థ ఇప్పటి వరకూ ఏ సినిమాకి కూడా ప్రశంస పత్రాన్ని అందివ్వలేదు. మొట్ట మొదటిసారిగా ‘కార్తికేయ 2’ చిత్రాన్ని ప్రశంసించింది. అంతేకాదు, ఇస్కాన్ ప్రధాన కేంద్రంలో ఈ సినిమాను ప్రదర్శించే అరుదైన అవకాశం కల్పించారు.


ప్రస్తుతం నిఖిల్ ‘స్పై’ అనే సినిమాలో నటిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘హిట్’ చిత్రాలకు  అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన గర్రి బిహెచ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో నిఖిల్ కి జోడిగా తమిళ బ్యూటీ ఐశ్వర్య మీనన్ నటిస్తోంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. ఈడి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై కె రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా చిత్రంగా ఈ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్ చిత్రంపై భారీగా అంచనాలు పెంచాయి.


Read Also: అద్భుతం, న్యూజెర్సీలో కార్ల లైట్లతో ‘నాటు నాటు’ ప్రదర్శన - వైరల్ అవుతోన్న టెస్లా వీడియో, డోన్ట్ మిస్!