బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రస్తుతం తన కెరీర్లో ఛాలెంజింగ్ టైమింగ్ ను ఎదుర్కొంటున్నాడు. 2024లో ఈ హీరో చేసిన ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. ఈ నేపథ్యంలోనే అక్షయ్ కుమార్ 2025లో ఎలాగైనా సరే హిట్ ట్రాక్ ఎక్కాలని పట్టుదలతో ట్రై చేస్తున్నారు. ఈ ఏడాదిని 'స్కై ఫోర్స్' మూవీతో స్టార్ట్ చేశాడు. అయితే దురదృష్టవశాత్తు ఈ మూవీ మొదట్లో హిట్ టాక్ తో దూసుకెళ్లినప్పటికీ, చివరికి కమర్షియల్ గా ఫెయిల్ అయింది. ఇక అక్షయ్ కుమార్ చేతిలో ప్రస్తుతం పలు ప్రాజెక్టులు ఉండగా, ఈసారి హిట్ అందుకోవడానికి తమిళ్ డైరెక్టర్ తో చేతులు కలపబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ తో 'ది గోట్' మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ వెంకట్ ప్రభుతో అక్షయ్ కుమార్ పాన్ ఇండియా మూవీనీ ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
అక్షయ్ కుమార్ -వెంకట్ ప్రభు కాంబినేషన్లో మూవీ
కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు వరుస హిట్ సినిమాలతో కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఇప్పటికే ఆయన సరోజ, గోవా, మంకత్త, బిర్యాని, మాస్, మానాడు వంటి హిట్ చిత్రాలను ఇచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తో కలిసి 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' అనే మూవీతో ప్రేక్షకులను పలకరించారు వెంకట్ ప్రభు. అయితే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అన్న విషయంపై ఇప్పటిదాకా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలోనే వెంకట్ ప్రభు - అక్షయ్ కుమార్ తో కలిసి పాన్ ఇండియా సినిమా చేయబోతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇటీవల వెంకట్ అక్షయ్ కుమార్ ని కలిసి స్క్రిప్ట్ చెప్పాడని, ఆయనకు కథాంశం బాగా నచ్చిందని సమాచారం. ఫలితంగా వీరిద్దరూ కలిసి ఓ బిగ్ ప్రాజెక్ట్ కు ప్రాణం పోయడానికి చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా మొదలు కాబోతోందని అంటున్నారు. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
హీరోకి, డైరెక్టర్ కి క్రూషియల్ ప్రాజెక్ట్
అక్షయ్ కుమార్ - వెంకట్ ప్రభు కాంబినేషన్లో సినిమా రాబోతుందనే రూమర్లలో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియదు. కానీ ఈ వార్తలు గనక నిజమైతే ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇద్దరికీ కీలకంగా కాబోతోంది. ఇప్పటికే అక్షయ్ కుమార్ గత నాలుగేళ్లలో 12 డిజాస్టర్ సినిమాలను చూశాడు. ఇక వెంకట్ రూపొందించిన చివరి రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఆ లిస్టులో కస్టడీ, గోట్ వంటి సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారని వార్తలు రావడం ఆసక్తికరంగా మారింది. ఇక అక్షయ్ కుమార్ ఖాతాలో ప్రస్తుతానికి హేరా ఫేరి 3, హౌస్ ఫుల్ 5, జాలి ఎల్ఎల్బి 3 వంటి మోస్ట్ అవైటింగ్ సీక్వెల్స్ ఉన్నాయి.