బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ ఇటీవల 'ఓ మై గాడ్ 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. సినిమాలో శివుడి పాత్రలో అక్షయ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో విభిన్న తరహా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు ఈ బాలీవుడ్ హీరో. రాణిగంజ్ కోల్డ్ ఫీల్డ్ లో 65 మంది మైనర్ లను కాపాడిన జస్వంత్ సింగ్ గిల్ జీవితం ఆధారంగా రూపొందుతున్న తాజా చిత్రం 'మిషన్ రాణిగంజ్' 'ది గ్రేట్ భారత్ రెస్క్యూ' అనేది ఈ చిత్రానికి ట్యాగ్ లైన్.


బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ టైటిల్ రోల్ చేస్తున్నారు. టీను సురేష్ దేశాయ్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్ సరసన పరిణితి చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా.. రవి కిషన్, కుముద్ మిశ్రా, పవన్ మల్హోత్రా, రాజేష్ శర్మ, వీరేంద్ర సక్సేనా, శిశిర్ శర్మ, అనంత్ మహాదేవన్, జమీల్ ఖాన్, ముఖేష్ భట్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను అక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.' 1989లో ఒక అసాధ్యమైన దానిని సాధించిన భారతదేశ నిజమైన హీరో కథను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాను' అంటూ టీజర్ ని షేర్ చేశారు. ఇక టీజర్ ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉంది.


ముఖ్యంగా టీజర్ లో రెస్క్యూ ఆపరేషన్ లో 350 అడుగుల లోతులో చిక్కుకుపోయిన మైనర్ల ప్రాణాలను కాపాడడానికి ఒక రక్షకుడిగా అక్షయ్ కుమార్ చేస్తున్న ప్రయత్నాలను ఎంతో ఉత్కంఠ భరితంగా టీజర్ లో చూపించారు. ఇక టీజర్ లో జస్వంత్ సింగ్ గిల్ గా అక్షయ్ కుమార్ పంజాబీ వేషాధరణలో కనిపించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టీజర్ నెటిజన్స్ ని ఆకట్టుకుంటుంది. పూజ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జాకీ భగ్నాని, దీప్సిక దేశ్ ముఖ్, అజయ్ కపూర్, వాసు బగ్నాని ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.


మరోవైపు ఈ మూవీ టైటిల్ కి గతంలో వేరే ట్యాగ్ లైన్ ఉండేది.' మిషన్ రాణిగంజ్': 'ది గ్రేట్ ఇండియన్ రెస్క్యూ' అని ఉంటే తాజాగా మేకర్స్ 'గ్రేట్ భారత్ రెస్క్యూ' గా మార్చారు. మన దేశం పేరును ఇండియా నుంచి భారత్ గా మారుస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశం మోటివ్ కూడా ఇదేనని న్యూస్ వచ్చింది. ఇలాంటి తరుణంలో దేశం పేరు మారకముందే అక్షయ్ కుమార్ సినిమా టైటిల్ మారడం పట్ల సోషల్ మీడియాలో కొందరు నెటిజెన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా పేరు మార్పుకు దేశం పేరు మార్పుతో ఏదైనా లింకుందా? అంటూ ఈ సందర్భంగా నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. అది తెలియాలంటే మూవీ టీం అయినా క్లారిటీ ఇవ్వాలి? లేదా సినిమా చూసి అయినా తెలుసుకోవాలి.


Also Read : లోదుస్తుల్లో నటించలేదని మాధురితో గొడవ, ఆగిపోయిన సినిమా - స్పందించిన డైరెక్టర్!








Join Us on Telegram: https://t.me/abpdesamofficial