ఒకప్పటి బాలీవుడ్ హీరోలలో ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి ఇప్పటికీ స్టార్లుగా వెలిగిపోతున్న వారు ఉన్నారు. అందులో అక్షయ్ కుమార్ ఒకరు. అసలు తన కెరీర్ బిగినింగ్‌లో అక్షయ్ ఎలాంటి కష్టాలు ఎదుర్కున్నాడనే విషయాలను ఇప్పటికీ పలుమార్లు బయటపెట్టాడు. అయితే అప్పటినుంచి ఇప్పటివరకు ఇండియాలోనే జీవిస్తున్నా.. కెరీర్‌లో ఎన్నో కష్టాలను దాటుకుంటూ టాప్ హీరోల్లో ఒకరిగా ఎదిగాడు అక్షయ్. అయితే, అక్షయ్ కుమార్‌కు ఇప్పటి వరకు భారతీయ పౌరసత్వం లేదనే విషయం మీకు తెలుసా? అదేంటీ.. అక్షయ్ భారతీయుడు కాదా? అనేగా మీ సందేహం? అక్షయ్ భారతీయుడే.. కానీ, కెనడాలో పుట్టిన ప్రవాస భారతీయుడు. ఇప్పటివరకు అతడికి కెనడా పౌరసత్వం మాత్రమే మాత్రమే ఉంది. ఇండియాలో సెటిలైనప్పటి నుంచి చాలా ఏళ్లుగా పూర్తిగా భారతీయుడిగా మారేందుకు పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్నాడు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎట్టకేలకు ఇండియన్ సిటిజన్‌షిప్ అందుకున్నాడు. తాజాగా ఈ గుడ్ న్యూస్‌ను అక్షయ్ సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు.
సిటిజెన్‌షిప్ వచ్చేసిందోచ్..
తను ఇండియన్ సిటిజెన్‌షిప్ పొందినట్టుగా అందుకున్న డాక్యుమెంట్స్‌ను అక్షయ్ కుమార్.. తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘మనసు, సిటిజెన్‌షిప్.. ఇప్పుడు రెండు ఇండియాకు చెందినవే. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్’ అంటూ ట్వీట్ చేశాడు అక్షయ్. ఎన్నో ఏళ్లుగా సిటిజెన్‌షిప్ కోసం ఎదురుచూస్తున్న అక్షయ్‌కు.. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా అది అందడం చాలా ఆనందంగా ఉందంటూ ఫ్యాన్స్ సైతం తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సినిమాల్లో నటించినా, స్టార్ హీరోగా ఎదిగినా కూడా అక్షయ్ మనసులో సిటిజెన్‌షిప్‌కు సంబంధించిన లోటు ఉందని సందర్భం వచ్చినప్పుడల్లా తన అసంతృప్తిని బయటపెట్టేవాడు. ఇప్పటికి అది తీరిపోయింది. ఇన్నాళ్లు కెనడా సిటిజెన్‌షిప్‌తో ఇండియాలో జీవించిన అక్షయ్‌కు ఫైనల్‌గా ఇండియన్ సిటిజెన్‌షిప్ దక్కింది.
హిట్ ఇచ్చిన ‘ఓఎమ్‌జీ 2’..
ఇటీవల అక్షయ్ కుమార్ ‘ఓఎమ్‌జీ 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కలెక్షన్స్ విషయంలో మాత్రమే కాదు.. కామెంట్స్ విషయంలో కూడా ‘ఓఎమ్‌జీ 2’ పూర్తిగా పాజిటివిటీ వైపే పరుగులు తీస్తోంది. ఈ సినిమాలో అక్షయ్.. శివుడి పాత్రలో కనిపించాడు. సమాజానికి ఉపయోగపడే ఎన్నో అంశాలు ఈ మూవీలో ఉన్నా కూడా దీనికి ‘ఏ’ సర్టిఫికెట్ ఇవ్వడంతో.. అక్కడి నుంచి దీనిపై చర్చ మొదలయ్యింది. అంతే కాకుండా ఇంతకు ముందు చాలా తక్కువ ఇండియన్ సినిమాలకు మాత్రమే ఈ రేంజ్‌లో కట్స్‌ను చేసింది సెన్సార్. అదే విధంగా ‘ఓఎమ్‌జీ 2’కు కూడా పూర్తిగా 27 కట్స్ చేసింది. అయినా కూడా అవన్నీ ప్రేక్షకులను సినిమా చూడకుండా ఆపలేకపోయాయి. అందుకే ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్‌తోనే ‘ఓఎమ్‌జీ 2’ హిట్ బొమ్మగా నిర్ధారణ అయ్యింది.
మూడు నెలలు మాత్రమే..
‘ఓఎమ్‌జీ 2’ ఇచ్చిన జోష్‌తో అక్షయ్ కుమార్ తన తరువాతి సినిమాలపై ఫోకస్ పెట్టాడు. మామూలుగా అక్షయ్ ఎంత పెద్ద సినిమాకు అయినా, భారీ బడ్జెట్ చిత్రానికి అయినా కేవలం 3 నెలలు మాత్రమే డేట్స్‌ను కేటాయిస్తాడు. దీని వల్ల తను ఎంతో నెగిటివిటీని ఎదుర్కున్నా కూడా ఆ పద్ధతిని మార్చుకోవడానికి అక్షయ్ ఏ మాత్రం ఇష్టపడడం లేదు. ఇక ‘ఓఎమ్‌జీ 2’ థియేటర్లలో సందడి చేస్తుండగానే.. తన తరువాతి చిత్రం ‘హెరా ఫెరీ 3’ షూటింగ్‌లో బిజీ అయ్యాడు. దీంతో పాటు తమిళ, తెలుగులో సూపర్ హిట్ అయిన ‘సురరాయ్ పొట్రూ’ను కూడా అక్షయ్ రీమేక్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ రీమేక్‌ను అనౌన్స్ చేసి చాలాకాలమే అయినా దీని గురించి ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు.
Also Read: రామ్ చరణ్ చేతుల మీదుగా ‘సోల్ ఆఫ్ సత్య’ విడుదల, సైనికుల జీవితాలకు అద్దంపట్టే పాట
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial