Tension In Bade ‘Miyan Chote Miyan’ Promotions In Lucknow: బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘బడేమియా ఛోటేమియా’. త్వరలో సినిమా థియేటర్లలో విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో ప్రమోషనల్ ఈవెంట్లు నిర్వహిస్తోంది. తాజాగా లక్నోలోని క్లాక్ టవర్ సెంటర్ లో ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్ లో అక్షయ్, టైగర్ వెరైటీగా ఎంట్రీ ఇచ్చారు. స్కైరోప్ తో ఈవెంట్ స్టేజ్‌పైకి వచ్చారు. అభిమానులకు అభివాదం చేస్తూ సందడి చేశారు. వెరైటీకి భిన్నంగా తమ అభిమాన హీరోలు ఎంట్రీ ఇవ్వడం అభిమానులు థ్రిల్ గా ఫీలయ్యారు.
లక్నో ప్రమోషన్ ఈవెంట్లో తీవ్ర ఉద్రిక్తత
ఈ ప్రమోషన్ ఈవెంట్ లో కాసేపు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ స్టేజి మీదికి వస్తున్న నేపథ్యంలో కొందరు ఆకతాయిలు అత్యుత్సాహం ప్రదర్శించారు. హీరోలు స్టేజి మీదకు చేరుకోగానే వెనక నుంచి చెప్పులు, రాళ్లు విసిరారు. ఒకేసారి చాలా మంది చెప్పులు విసరడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారు. ఆకతాయిలను అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పలువురిపై లాఠీ ఛార్జ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పలువురు అక్కడ నుంచి పరిగెత్తారు. ఈ సందర్భంగా తోపులాట జరిగి పలువురు అభిమానులు కిందపడిపోయారు. కాసేపు నిర్వాహకులు కార్యక్రమాన్ని నిలిపివేశారు. అనంతరం పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. కొద్దిసేపు గందరగోళం తర్వాత తిరిగి ప్రమోషనల్ ఈవెంట్ ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ అభిమానులలో ఉత్సాహం కలిగించేలా మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
ఏప్రిల్ 10న ‘బడేమియా ఛోటేమియా’ విడుదల
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో ‘బడేమియా ఛోటేమియా’ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో జాన్వీ కపూర్, మానుషి చిల్లర్, హీరోయిన్‌లుగా నటిస్తుండగా.. సోనాక్షి సిన్హా, అలయ ఎఫ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించనున్నారు. వాషు భగ్నాని పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి AAZ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. వాషు భగ్నాని, దీప్సికా దేశ్‌ముఖ్, జాకీ భగ్నాని, హిమాన్షు కిషన్ మెహ్రా, అలీ అబ్బాస్ జాఫర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'బడే మియా చోటే మియా' ఈద్ కానుకగా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also: ఆశిష్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్- ధైర్యం ఉంటే ప్రేమించు అంటున్న దిల్ రాజు ఫ్యామిలీ హీరో!