Akhanda 2 postponed reasons: ఇటు ఇండియా, అటు అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా 'అఖండ 2' తాండవం చేయాల్సిన సమయమిది. అనూహ్యంగా సినిమా విడుదల వాయిదా అనేది బాలయ్య అభిమానులతో పాటు ప్రేక్షకులకు పిడుగు లాంటి వార్త. తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్ షోకు అనుమతి ఇవ్వడంతో పాటు మూడు రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుతూ జీవో ఇవ్వడంతో ఇక షోలు పడటమే ఆలస్యం అనుకున్న తరుణంలో... తొలుత ప్రీమియర్స్, ఆ తర్వాత విడుదల క్యాన్సిల్ అయ్యింది. వాయిదా పడినట్టు 14 రీల్స్ ప్లస్ సంస్థ ప్రకటించింది. అసలు వాయిదాకు కారణాలు ఏమిటి? అంటే...
'అఖండ 2' విడుదలపై మద్రాస్ హైకోర్టు స్టే!Madras High Court Stay On Akhanda 2 Release: 'అఖండ 2' విడుదలపై మద్రాస్ హైకోర్టు డిసెంబర్ 3వ తేదీన స్టే ఇచ్చింది. చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ సంస్థ తమకు డబ్బులు ఇవ్వాలని, తమ బాకీలు తీర్చే వరకు సినిమా విడుదలపై ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలని బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. వాళ్లకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
ఎరోస్ ఒక్కటేనా... ఫైనాన్షియర్ల మాట కూడా!ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఒక్కటే కాదు... 'అఖండ 2'కు డబ్బులు సమకూర్చిన ఫైనాన్షియర్లు సైతం సినిమా విడుదలకు అడ్డు పడినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 'అఖండ 2'కు ఐవివై ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మరొక ముగ్గురు ఫైనాన్స్ చేశారు. వాళ్ళ అమౌంట్ సెటిల్ చేయలేదట. దాంతో విడుదలకు ముందు రోజు ల్యాబ్ దగ్గర నుంచి క్లియరెన్స్ రాలేదట. ఎరోస్ ఒక్కటే కాదు అని... ఫైనాన్షియర్లతో పాటు నిర్మాతలు క్లియర్ చేయాల్సిన బాకీలు ఇంకా ఉన్నాయని టాక్.
'సర్కారు వారి పాట'ను వదిలేసి 'అఖండ 2'ను...అసలు 14 రీల్స్ ప్లస్, ఎరోస్ ఇంటర్నేషనల్ మధ్య గొడవ ఏమిటి? ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' విడుదల అయినప్పుడు, 'అఖండ 2' ఎందుకు ఆగింది? అంటే... సమస్య ఇప్పటిది కాదు.
నిజానికి 14 రీల్స్ ప్లస్, ఎరోస్ మధ్య ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జారలేదు. కానీ 14 రీల్స్ ప్లస్ అధినేతలు రామ్ ఆచంట, గోపి ఆచంట భాగస్వాములు అయిన 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ (అనిల్ సుంకర మరో భాగస్వామి), ఎరోస్ మధ్య మహేష్ బాబు 'దూకుడు' నిర్మాణంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయి. అప్పట్లో 14 రీల్స్, ఎరోస్ మధ్య డిస్టర్బెన్స్ వచ్చింది. దాంతో గొడవలు మొదలు అయ్యాయి. ఆ గొడవ కాస్త చిలికి చిలికి గాలివానగా కూడా కాదు... పెద్ద సునామీగా మారింది. 'సర్కారు వారి పాట' విడుదల సమయంలో మౌనంగా ఉన్న ఎరోస్ ఇప్పుడు 'అఖండ 2' విడుదల మీద స్టే కోరింది. వాళ్ళకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
14 రీల్స్ & ఎరోస్ మధ్య కేసు ఎప్పట్నించి ఉంది?14 రీల్స్ లేదా 14 రీల్స్ ప్లస్ & ఎరోస్ మధ్య కోర్టు కేసులు కొన్నేళ్ల నుంచి నానుతూ ఉన్నాయి. తమ డబ్బులు ఇవ్వాలని కొన్నేళ్ల క్రితం ఎరోస్ ట్రిబ్యులన్‌కు వెళ్లగా... 2019లో వాళ్లకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దాని సవాల్ చేస్తూ 2020లో మద్రాస్ హైకోర్టుకు, 2021లో డివిజన్ బెంచ్, ఆగస్టు 2021లో సుప్రీమ్ కోర్టుకు 14 రీల్స్ వెళ్ళింది. కానీ ఒక్క రూపాయి కట్టలేదు. పైగా 14 రీల్స్ సంస్థకు అనుకూలంగా తీర్పు రాలేదు.
'అఖండ 2' విడుదలపై ఎరోస్ స్టే కోరగా... 14 రీల్స్ ప్లస్ సంస్థపై తీసిన సినిమా అని నిర్మాతలు కోర్టుకు తెలిపారు. అయితే... 14 రీల్స్, 14 రీల్స్ ప్లస్ వేర్వేరు కాదని, రెండు సంస్థల్లో భాగస్వాములు రామ్ ఆచంట, గోపి ఆచంట అని ప్రూవ్ చేయడంలో ఎరోస్ సక్సెస్ అయ్యింది. దాంతో 28 కోట్ల రూపాయలకు వడ్డీతో సహా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఇప్పుడు ఆ డబ్బులు కట్టడంతో పాటు లోకల్ ఫైనాన్షియర్లకు సెటిల్ చేస్తే సినిమా విడుదల అవుతుంది.