Ajith Kumar About His Retirement: తాను ఎప్పుడైనా బలవంతంగా మూవీస్ వీడాల్సి రావొచ్చని కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar) అన్నారు. తాజాగా.. పద్మ భూషణ్ అవార్డు అందుకున్న ఆయన ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

నా రిటైర్మెంట్ ఎప్పుడో తెలియదు..

తాను మూవీస్ నుంచి ఎప్పుడు క్విట్ అవుతానో తనకే తెలియదని అజిత్ (Ajith) అన్నారు. 'నేను బలవంతంగానైనా మూవీస్ వీడాల్సి రావొచ్చు. నేను ఏ విషయాన్ని కూడా తేలికగా తీసుకోకూడదని అనుకుంటున్నా. ఆడియన్స్ నా యాక్టింగ్‌పై కూడా కంప్లైంట్ చేస్తారేమో నాకు తెలియదు!. వారిలో నాకు ఎక్కువ క్రేజ్ ఉన్నప్పుడే నేను రిటైర్ అవుతానేమో. జీవితం చాలా విలువైనది. నేను లైఫ్‌లో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను.

నా స్నేహితులు, బంధువుల్లో చాలామంది జీవితాల్లో పోరాటాలు చేస్తున్నవారు ఉన్నారు. వారిలో కొందరు క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటూ జీవిస్తున్నారు. అలాంటి వారిని చూసినప్పుడు లైఫ్ విలువ అర్థమవుతుంది. నేను నా లైఫ్‌లోని ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలనుకుంటున్నా. జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నా. టైం వేస్ట్ చేయను.' అని అజిత్ అన్నారు.

Also Read: యాంకర్ ప్రదీప్ కొత్త మూవీ నుంచి సుమంత్ 'అనగనగా' వరకూ.. - ఓటీటీలో మేలో వచ్చే సినిమాల లిస్ట్!

అప్పులు తీర్చేందుకే యాక్టర్ అయ్యా

తాను అప్పులు తీర్చేందుకే ఇండస్ట్రీలోకి వచ్చినట్లు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో అజిత్ తెలిపారు. మూవీ కెరీర్, కార్ రేసింగ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'నాకు ఫస్ట్ ఓ తెలుగు మూవీ ఆడిషన్ వచ్చింది. నాకు తెలుగు మాట్లాడడం రాదు. దాన్ని నేర్చుకునేందుకు ప్రయత్నించాను. ఇండస్ట్రీకి వెళ్తానంటే నా పేరెంట్స్ ఫస్ట్ ఆందోళన చెందారు. వారిని ఒప్పించి అడుగు వేశాను. వచ్చిన ప్రతీ ఛాన్స్ సద్వినియోగం చేసుకుంటూ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నా.

మనం ఒకటి అనుకుంటే విధి మనల్ని మరొకటి చేస్తుంది. నేను స్టార్‌గా ఎదగాలని ఇండస్ట్రీకి రాలేదు. అప్పులు తీర్చేందుకే ఇండస్ట్రీకి వచ్చాను. నా ఫస్ట్ సినిమాలో నా యాక్టింగ్ భయంకరంగా ఉంటుంది. తమిళంలో కూడా నా కొత్త మూవీస్‌కు వేరే వారితో డబ్బింగ్ చెప్పించేవారు. నేను మాట్లాడే యాస బాగాలేదని ఎంతోమంది విమర్శించారు. నేను విమర్శలకు కుంగిపోకుండా.. వాటిని సవాల్‌గా తీసుకుని నిజాయతీగా పనిచేశాను.' అని అజిత్ తెలిపారు.

మోడలింగ్ డబ్బులు రేసింగ్‌లకు

తాను ఓ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం చేసేవాడినని.. దీంతో పాటే ఆటోమొబైల్ కంపెనీలోనూ పని చేసేవాడినని అజిత్ చెప్పారు. 'ఆటోమొబైల్ కంపెనీలో పని చేసేటప్పుడే రేసింగ్ ప్రారంభించాను. ఓ వ్యక్తి సలహాతో మోడలింగ్‌కు ప్రయత్నించాను. అందులో వచ్చిన డబ్బులనే రేసింగ్‌లకు ఖర్చు చేసేవాడిని.' అని అన్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. అజిత్ లేటెస్ట్ మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'  ఈ నెల 8 నుంచి ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానుంది. అజిత్ సరసన త్రిష నటించగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. అర్జున్‌దాస్, ప్రభు, ప్రసన్న, సునీల్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ మూవీని నిర్మించారు.