Ajith Kumar Risky Stunts: తమిళ సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజిత్ కుమార్. ఫ్యామిలీ, మాస్, యాక్షన్ అనేది తేడా లేకుండా.. సినిమా ఏదైనా తన మార్క్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. చివరగా ‘తునీవు’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆయన, ప్రస్తుతం ‘విదాముయర్చి’ అనే సినిమాలో నటిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. యాక్షన్ ఎంటర్ టైన్మెంట్ మూవీగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా కోసం అజిత్ ప్రాణాలను పణంగా పెట్టి స్టంట్లు చేస్తున్నారు.


గతంలో గాయాలు అయినా తగ్గేదే లేదంటున్న అజిత్


‘విదాముయర్చి’ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం ఇప్పటికే ఓసారి స్టంట్లు చేసి గాయపడ్డారు అజిత్. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా కోసం అజిత్ కారు నడుపుతుండగా పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన స్వల్పగాయాలతో బయటపడ్డారు. దీంతో అందరూ రిలాక్స్ అయ్యారు. తాజాగా ఇదే సినిమా కోసం మరోసారి కళ్లు చెదిరే స్టంట్లు చేశారు. కారును క్రేన్ సాయంతో గాల్లోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత కారును గాలిలోనే పల్టీలు కొట్టించారు. ఆ కారులో అజిత్ తో పాటు ఆరవ్ అనే నటుడు కూడా ఉన్నాడు. ప్రాణాలకు తెగించి ఆయన ఈ స్టంట్లు చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.


రియల్ స్టంట్లు చూసి ఆశ్చర్యపోతున్న అభిమానులు


వాస్తవానికి సినిమాల్లో డేంజరస్ స్టంట్లను డూప్‌తో చేయిస్తారు. కానీ, అజిత్ మాత్రం తన సినిమాల్లో డూప్ లేకుండానే డేంజరస్ స్టంట్లు అవలీలగా చేసేస్తున్నారు. సినిమాల కోసం ప్రాణాలు పణంగా పెడుతున్నారు. అజిత్ తాజా స్టంట్స్ వీడియోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. సినిమాల కోసం ఆయన పడుతున్న కష్టాన్ని చూసి అభినందిస్తున్నారు. రియల్ హీరో అంటూ కొనియాడుతున్నారు. ఆయన చేసే ప్రయత్నం ఎప్పుడూ విఫలం కాదని చెప్పుకొస్తున్నారు. ‘విదాముయర్చి’ సినిమాలో ఈ షాట్ బ్లాస్ట్ కావడం ఖాయం అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొంత మంది ఆయన ప్రయత్నాన్ని మెచ్చుకుంటూనే, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి స్టంట్లు చేయడం వల్ల ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండాలంటున్నారు.






‘విదాముయర్చి’ గురించి..


యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ‘విదాముయర్చి’ సినిమా రూపొందుతోంది. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అజిత్ హీరోగా నటిస్తుండగా త్రిష, రెజీనా హీరోయిన్లుగా చేస్తున్నారు. సీనియర్ నటుడు అర్జున్ సర్జా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాతో పాటు అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే మరో సినిమను కూడా చేస్తున్నారు.



Read Also: 1000 Crore Movies: బాహుబలిని బీట్ చేసేదెవరు? 1000 కోట్లు క్లబ్బు దాటి వెళ్ళేదెవరు?