Ajith Vidaamuyarchi Box Office First Day Collections: తమిళ అగ్ర హీరో అజిత్ (Ajith) హీరోగా త్రిష కథానాయికగా వచ్చిన తాజా చిత్రం 'విడాముయర్చి' (Vidaamuyarchi) శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో 'పట్టుదల' (Pattudala) పేరుతో థియేటర్లలోకి వచ్చింది. అయితే, ఈ చిత్రం తొలి రోజు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత కలెక్షన్లు రాబట్టలేకపోయింది. అజిత్‌కు తమిళంలో ఉన్న క్రేజ్ కారణంగా ఫస్ట్ డే రికార్డు కలెక్షన్లు రాబడుతుందనుకున్న ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.22 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో తమిళ వెర్షన్‌లో కలెక్షన్స్ రూ.21.50 కోట్లు ఉండగా.. తెలుగు వెర్షన్‌కు కేవలం రూ.50 లక్షలు మాత్రమే రాబట్టగలిగింది. అటు, శుక్రవారం నాగచైతన్య 'తండేల్' చిత్రం రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో దీని ప్రభావం 'విడుదల'పై మరింత పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Also Read: తండేల్ రివ్యూ: సముద్రంలో చిక్కిన ప్రేమ... తీరానికి ఎలా చేరింది? నాగచైతన్య సినిమా హిట్టా? ఫట్టా?

అజిత్‌కు తెలుగులో సరైన మార్కెట్ లేకపోవడం, అసలే ప్రమోషన్స్ చేయకపోవడం.. సినిమా టాక్ నేపథ్యంలో తెలుగులో కలెక్షన్లు ఇలా వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, మగిళ్ తిరుమేని దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన 'విడాముయర్చి' సినిమాకు అనిరుధ్ సంగీతం అందించారు. యాక్షన్ కింగ్ అర్జున్, రెజీనా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగానే విడుదల కావాల్సి ఉన్నా.. కాస్త ఆలస్యంగా ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఆశించినంతగా ప్రభావం చూపలేకపోయింది. అయితే, అజిత్ నటించిన గత మూవీ 'తునివు' ఫస్ట్ డే ఇండియాలో రూ.24.4 కోట్ల గ్రాస్ నెట్ వసూలు చేశాయి.

Also Read: దాదాసాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నిర్వాహకులపై ఛీటింగ్ కేసు - వెలుగులోకి సంచలన నిజాలు

యాక్షన్ థ్రిల్లర్‌గా..

యాక్షన్ ఫిలిమ్స్ చేయడంలో అజిత్ కుమార్ స్టైల్ సపరేట్. స్వతహాగా కార్ రేసర్ కావడంతో డూప్ లేకుండా ఛేజింగ్ సీక్వెన్సులు చేయడం ఆయనకు అలవాటు. హాలీవుడ్ తరహాలో స్టైలిష్ అండ్ స్లీక్ యాక్షన్ ఫిలిమ్స్ చేసి విజయాలు అందుకున్నారు. 'విడాముయర్చి' మూవీ కూడా యాక్షన్ థ్రిల్లర్‌గానే రూపొందింది. కిడ్నాపైన తన భార్యను అన్వేషించే క్రమంలో హీరోకు ఎదురయ్యే పరిణామాలను సినిమాలో చూపించారు. కాగా, ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు.

'పట్టుదల' కథేంటంటే.?

ఇక 'పట్టుదల' కథ విషయానికొస్తే.. అజర్ బైజాన్‌లోని బాకు నగరంలో ఓ కంపెనీలో అర్జున్ (అజిత్ కుమార్) ఉన్నతోద్యోగి. ఆయన భార్య కాయల్ (త్రిష). ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరి బంధం దాదాపు 12 ఏళ్ల తర్వాత బీటలు వారుతుంది. అర్జున్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్న కాయల్ తన పుట్టింటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఆమెను ఇంటి వద్దే తానే దిగబెడతాననే ఇది ఇద్దరికీ జీవితంలో గుర్తుండిపోయే ఆఖరి ప్రయాణం అంటూ అర్జున్ చెప్పగా.. కాయల్ సరే అంటుంది. అలా మొదలైన ప్రయాణంలో ఎదురైన అవాంతరాలు, కాయల్ అదృశ్యం, ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన అర్జున్‌కు ఎదురైన పరిణామాలు.. మధ్యలో పరిచయమైన తెలుగు వాళ్లు రక్షిత్ (అర్జున్), దీపిక (రెజీనా)కు సంబంధం ఏంటనేదే కథ.