Vishwak Sen: 'అంతా ఒకటే, దయచేసి కాంపౌండ్‌లు పెట్టొద్దు' - మాస్ కా దాస్ విశ్వక్ సేన్ స్ట్రాంగ్ రిప్లై
Vishwak Sen Comments: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజా చిత్రం 'లైలా' చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ ముఖ్య అతిథిగా రానుండడంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు విశ్వక్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.

Vishwak Sen About Compounds And Groups In Film Industry: సినీ పరిశ్రమ అంతా ఒకటేనని.. దయచేసి కాంపౌండ్స్ కట్టొద్దని మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) అన్నారు. ఆయన కీలక పాత్ర పోషించిన 'లైలా' (Laila) చిత్ర ట్రైలర్ గురువారం విడుదల కాగా.. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. 'మీ ఈవెంట్స్‌కు నందమూరి హీరోలను తెస్తారు. సడెన్‌గా బాస్‌ను తీసుకొచ్చారు. ఆ కాంపౌండ్ నుంచే ఇటు వచ్చారా.?' అన్న ప్రశ్నకు అదిరే రిప్లై ఇచ్చారు.
'ఇండస్ట్రీ అంతా ఒకటే'
కాంపౌండ్‌లు మీరు వేసుకుంటారని.. తమకున్నది ఒకటే కాంపౌండ్ అని విశ్వక్ సేన్ తెలిపారు. 'ఇది మా ఇంటిది. ఇండస్ట్రీలో అలాంటివేమీ లేవు. అంతా ఒకటే. బాస్ ఈజ్ బాస్. మమ్మల్ని అభిమానించే వారు ఎలా ఉంటారో.. మేము అభిమానించే వాళ్లు అలాగే ఉంటారు. మాకు వారితో అనుబంధం ఉందని ప్రతిసారీ వారిని పిలిచి ఇబ్బంది పెట్టలేం కదా. ఒక హీరోను ఈవెంట్‌కు పిలవడానికి 100 కారణాలు ఉంటాయి. మా నాన్నకు, మెగాస్టార్ చిరంజీవి గారికి రాజకీయాల నుంచి పరిచయం ఉంది. ఆ సమయంలో ఎమ్మెల్యేగానూ పోటీ చేశారు. నా చిన్నప్పటి నుంచి ఆయన మా శ్రేయోభిలాషి. దయచేసి మీరు గోడలు కట్టొద్దు. ఒకరిపై ఒకరు కోపాలు పెంచుకుని తిట్టుకుంటున్నారు. అలాంటివి సమసిపోయేలా మీరు చేయాలి. అంతే కానీ మధ్యలో మీరు కాంపౌండ్‌లు కట్టొద్దు. మేము మంచి ఉద్దేశంతో సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాం. మీరొచ్చి దానిలో ఏమీ వేయకండి' అంటూ విశ్వక్ అసహనం వ్యక్తం చేశారు. కాగా, 'లైలా' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 9వ తేదీన పెద్ద ఎత్తున జరగబోతోంది. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా హాజరు కాబోతున్నారు.
విశ్వక్ సేన్.. అమ్మాయిగా, అబ్బాయిగా రెండు పాత్రల్లో నటించిన చిత్రం 'లైలా'. ఈ చిత్రాన్ని రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఈ సినిమాను మేకర్స్ విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ చిత్ర ట్రైలర్‌ను మూవీ టీం గురువారం విడుదల చేసింది.
తన పాత్రపై..
'లైలా' సినిమాలో తన పాత్రలపై విశ్వక్ స్పందించారు. 'ప్రేక్షకుల్ని నవ్వించడం కోసమే తొలిసారి అమ్మాయి గెటప్ వేశాను. ఈ సినిమా యూత్‌కు పవర్ ప్యాక్ట్‌గా ఉంటుంది. లైలా గెటప్ కోసం రోజుకు 2 గంటలు పట్టేది. ఈ పాత్ర చేసిన నెలన్నర రోజులు ఇంటి నుంచి బయటకు వచ్చే వాడిని కాదు. కచ్చితంగా ఇది ఓ వెరైటీ సినిమా. వినోదం పంచడమే ఈ చిత్రం లక్ష్యం.' అని తెలిపారు. కాగా, మరో 4 నెలల్లో తమ బ్యానర్‌లో మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి సినిమా మొదలవుతుందని నిర్మాత సాహు గారపాటి చెప్పారు.