Aishwarya Rajinikanth: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దంపతులు విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట, తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 18 ఏళ్లు భార్యాభర్తలుగా కలిసున్న వారు, సడన్ గా విడిపోతున్నట్లు పోస్టులు పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పటి నుంచీ ఇద్దరూ వేర్వేరు మార్గాల్లో జీవనం సాగిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య రజనీకాంత్ తన జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


'లాల్ సలామ్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య రజినీకాంత్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను ఒంటరితనాన్ని బాగా ఆస్వాదిస్తున్నట్లుగా తెలిపింది. దాదాపు రెండేళ్లుగా నేను ఒంటరిగానే ఉంటున్నాను. ఇది నాకు బాగా నచ్చింది. దీని వల్ల నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఒంటరిగా ఉన్నప్పుడే మనం మరింత సురక్షితంగా ఉండగలం అని చెప్పింది. తన పిల్లల కోసమే అప్పట్లో సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నట్లుగా చెప్పింది. పిల్లలు ఎదిగే సమయంలో వారితో ఉండాలనుకున్నా కానీ కుదరలేదని ఐశ్వర్య చెప్పుకొచ్చింది.


ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ కొన్నేళ్లపాటు ప్రేమించుకొని 2004లో పెళ్ళి చేసుకున్నారు. వీరికి యాత్ర, లింగా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఎంతో అన్యోన్యంగా దాంపత్య జీవితం గడిపిన వీరు.. 2022 జనవరిలో విడిపోతున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. "18 ఏళ్లపాటు స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా ఒకరినొకరం అర్థం చేసుకొని మా ప్రయాణం కొనసాగించాం. ఇప్పుడు మేము వేర్వేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యాము. మేము విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యక్తిగత గోప్యత అవసరం. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించండి" అని పేర్కొన్నారు. 


ధనుష్ - ఐశ్వర్య విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియా మాధ్యమాల నుంచి తొలగించారు. అప్పటి నుంచీ ఒకరికొకరు దూరంగా జీవిస్తున్నారు. ఇద్దరూ తమ తమ ప్రొఫిషన్స్ లో బిజీ అయిపోయారు. అయితే వీరు చట్టప్రకారం విడాకులు తీసుకోకపోవడంతో మాజీ జంట మళ్లీ కలుస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఒంటరి తనమే బాగుందని ఇప్పుడు ఐశ్వర్య కామెంట్స్ చేయడం చూస్తుంటే, ఆ విషయంలో అభిమానులకు నిరాశ తప్పదనిపిస్తోంది.


2012లో ధనుష్ హీరోగా నటించిన '3' చిత్రంతో డైరెక్టర్ గా పరిచయమయ్యారు ఐశ్వర్య రజినీకాంత్. ఆ తర్వాత 'వాయ్ రాజా వాయ్' అనే సినిమాకి తెరకెక్కించింది. ఇదే క్రమంలో రజినీ కాంత్ వాయిస్ తో 'సినిమా వీరన్' అనే డాక్యుమెంటరీ రూపొందించింది. ఏడేళ్ళ తర్వాత మళ్లీ ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకొని 'లాల్ సలాం' చిత్రాన్ని తెరకెక్కించింది. తన తండ్రి రజనీకాంత్ స్పెషల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషించారు. గత శుక్రవారం విడుదలయిన ఈ చిత్రానికి తెలుగులో నెగిటివ్ టాక్ వచ్చింది. ప్రమోషన్స్ పెద్దగా చేయకపోవడంతో ఎలాంటి ప్రీ రిలీజ్ బజ్ లేకుండానే రిలీజయింది. దీనికి తగ్గట్టుగానే కలెక్షన్స్ మరీ దారుణంగా ఉన్నాయి. ఫైనల్ రన్ లో ఏ మేరకు వసూళ్లు రాబడుతుందో చూడాలి.


Also Read: బుల్లితెరపై రామ్ ర్యాంపేజ్.. డిజాస్టర్ సినిమాలకూ డీసెంట్ టీఆర్పీ!