బాలీవుడ్ లెజెండరీ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ మ‌నువ‌రాలు, అభిషేక్-ఐశ్వర్య రాయ్ ల కుమార్తె ఆరాధ్య బ‌చ్చ‌న్‌ ఆరోగ్యంపై ఇటీవ‌ల యూట్యూబ్‌ లో ఫేక్ న్యూస్ ప్ర‌చారం చేశారు. దీనిపై అభిషేక్ బ‌చ్చ‌న్ దంపతులు ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించగా.. భ‌విష్య‌త్తులో ఇలాంటి తప్పుడు వార్త‌ల‌ను వ్యాప్తి చేయరాదని హెచ్చ‌రిస్తూ పలు యూట్యూబ్ ఛానల్స్ పై చర్యలు తీసుకున్నారు. అయితే ఆరాధ్య ఫేక్ న్యూస్ కేసుపై తాజాగా ఆమె తల్లి ఐశ్వర్య రాయ్ బచ్చన్ స్పందించింది. వ్యక్తులను మానసికంగా, మనోభావాలను బాధించే అసంబద్ధమైన న్యూస్ కంటెంట్ గురించి మాట్లాడింది. 


ఐశ్వర్య రాయ్ బచ్చన్ 'పొన్నియిన్ సెల్వన్ 2' సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 28న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న ఐశ్యర్య ఓ కార్యక్రమంలో విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. తప్పుడు కంటెంట్ రాయడం అనవసరమని, అది చాలా సున్నితమైనదని పేర్కొంది. మీడియా అలాంటి వార్తలను శాశ్వతంగా కొనసాగించదని తాను ఆశిస్తున్నానని చెప్పింది. 


మానసికంగా, సెంటిమెంటల్ గా బాధించే అసంబద్ధమైన ఫేక్ వార్తల గురించి ఐశ్యర్య బచ్చన్ మాట్లాడుతూ.. "మీడియాకు చెందిన వ్యక్తి ఆ వార్త వైరల్ అవుతోందని గుర్తించడం చాలా ఆనందంగా ఉంది. మీరు దానిని శాశ్వతంగా కొనసాగించడం లేదని, మీరు దానిని ప్రోత్సహించడం లేదని భావిస్తున్నాను. తప్పుడు రాతలు లేదా అనవసరమైన రాతల ప్రతికూల ప్రభావాన్ని మీరు తెలివిగా గుర్తించినందుకు చాలా ధన్యవాదాలు'' అని చెప్పుకొచ్చింది. 


కోర్టును ఆశ్రయించిన ఆరాధ్య బచ్చన్


కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్ లో 11 ఏళ్ల ఆరాధ్య బచ్చన్ ఆరోగ్యం గురించి ఫేక్ న్యూస్ ప్రచారం చేశారు. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం ఐశ్వ‌ర్య రాయ్ బ‌చ్చ‌న్‌, అభిషేక్ బ‌చ్చ‌న్‌ లు కోర్టును ఆశ్ర‌యించారు. కేసు విచార‌ణ స‌మ‌యంలో ఫేక్ న్యూస్ ను వ్యాప్తి చేస్తున్న న్యాయస్థానం నిల‌దీసింది. త‌ప్పుడు కంటెంట్‌ ను పోస్టు చేయ‌కుండా నిరోధించడానికి ఎలాంటి పాల‌సీలు లేవా అని కోర్టు ప్ర‌శ్నించింది. యూజ‌ర్ల‌కు ఓ ఫ్లాట్‌ ఫామ్ ఇచ్చేసి, వాళ్లు ఏది పోస్టు చేసినా త‌మ‌కు బాధ్య‌త లేద‌న్న‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఈ క్రమంలో గూగుల్, యూట్యూబ్‌ కు స‌మ‌న్లు జారీ చేసింది. 


ప్ర‌తి చిన్నారికి గౌర‌వంగా, మ‌ర్యాద‌గా జీవించే హ‌క్కు ఉంద‌ని, ఫేక్ వార్త‌ల‌ను ప్ర‌సారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. సెలబ్రిటీల పిల్లలైనా, సాధారణ వ్యక్తి అయినా అందరూ ఒకటేనని జస్టిస్ సి హరిశంకర్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా శారీరక, మానసిక ఆరోగ్యానికి సంబంధించి పిల్లల గురించి తప్పుదారి పట్టించే సమాచారాన్ని ప్రసారం చేయడం సరికాదని హెచ్చరించారు. త‌క్ష‌ణ‌మే త‌మ ఫ్లాట్‌ ఫామ్ నుంచి ఆ వార్త‌ల‌ను తొల‌గించాల‌ని ఆదేశించిన కోర్టు.. ఆరాధ్య ఆరోగ్యం గురించి తప్పుడు కంటెంట్‌ ను పంచుకున్నందుకు తొమ్మిది యూట్యూబ్ ఛానల్స్ ను నిషేధిస్తూ చర్యలు తీసుకుంది. 


Also Read : ఈవిల్ డెడ్ రైజ్ రివ్యూ: ‘ఈవిల్ డెడ్’ ఫ్రాంచైజీలో కొత్త సినిమా ఎలా ఉంది? ఫ్యాన్స్‌ను ఖుషీ చేసిందా?