Ramoji Rao death: రామోజీ సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల యావత్ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సినీ ప్రముఖులు ఆయన కన్ను మూశారనే వార్తను తెలుసుకుని తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు. ఆయన మృతి యావత్ సినీ పరిశ్రమకు తీరని లోటుగా అభివర్ణించారు.


ఈ రోజు షూటింగ్స్ కొనసాగిస్తాం - యమున


రామోజీ ఫిల్మ్ సిటీలో సినీ నటి యమున రామోజీ రావు మృతదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. సినీ ప్రయాణంలో ఆయన సపోర్టును మర్చిపోలేనంటూ ఎమోషనల్ అయ్యింది. “ఆయన లేరనే విషయాన్ని తెలుసుకుని నాకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం రామోజీ రావు. ఆయన గొప్ప మనిషి. ఆయన తగ్గర నుంచి క్రమశిక్షణగా ఎలా ఉండాలో నేర్చుకున్నాను. కష్టాన్ని నమ్ముకున్న వాళ్లు ఎప్పుడూ బాగుంటారని తను చెప్పేవారు. ఈ వయసులోనూ ఎందుకు అంద కష్టపడుతున్నారు? అని అడిగేదాన్ని. నాకు పని చేయడం అంటేనే ఇష్టం అని చెప్పేవారు. ఆయన మానవత్వం ఉన్న మనిషి. ఏ చిన్న పొజిషన్ లో ఉన్నా.. కష్టపడి పని చేసే వాళ్లు అంటే చాలా ఇష్టం. ఆయన మృతి వార్త తెలుసుకుని షాక్ అయ్యాను. ఏం జరిగిన ఎవరూ తమ పనులు మానుకోవద్దని చెప్పేవారు. ఆయన మాటలను గౌరవించి ఈ రోజూ షూటింగ్స్ లో పాల్గొంటున్నాం. ఇదే ఆయనకు మేం ఇచ్చే నివాళిగా భావిస్తున్నాం” అని యమున వెల్లడించారు.



రామోజీరావు నాకు లైఫ్ ఇచ్చారు- నరేష్


‘శ్రీవారి ప్రేమలేఖలు’ సినిమాతో రామోజీ రావు తనకు సినీ లైఫ్ ఇచ్చారని సీనియర్ నటుడు నరేష్ వెల్లడించారు. 40 ఏండ్లుగా ఆయనతో తన ప్రయాణం కొనసాగుతుందన్నారు. ఆయనతో ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయన్నారు. “నాకు నలుగురు వ్యక్తులు ఎంతో ఇష్టం. అమ్మ, కృష్ణగారు, జంధ్యాల గారు, రామోజీ రావు గారు. ఆయనతో 10 నిమిషాలు కూర్చుంటే తెలియని శక్తి వచ్చేది. ఆయన లేకపోవడం నాకు ఎంతో బాధగా ఉంది. రామోజీ ఫిల్మ్ సిటీతో భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. యూనివర్సల్, వాల్ట్ డిస్నీకి దీటుగా భారతీయ చిత్ర పరిశ్రమను తీసుకువెళ్లిన వ్యక్తి రామోజీరావు. ఈనాడు సంస్థల ద్వారా పత్రికా రంగానికి ఎనలేని సేవ చేశారు. ఆయన మృతి పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అన్నారు. అటు భారతీయ సినీ పరిశ్రమకు ప్రపంచ స్థాయి గౌరవాన్ని తీసుకురావడంలో రామోజీరావు ఎంతో కృషి చేశారని నటి పవిత్ర తెలిపారు. సినిమా రంగంతో పాటు మీడియా రంగంలో ఆయన చేసిన సేవలు ఎంతో గొప్పవి అన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.


Read Also : బోరున విలపించిన దర్శకేంద్రుడు , రామోజీ రావుకు భారతరత్న ఇవ్వాలంటూ రాజమౌళి భావోద్వేగం 



Read Also : రామోజీ రావు కలల నిర్మాణం రామోజీ ఫిల్మ్ సిటీ - ఈ ఫాంటసీ ప్రపంచంలో ఎన్నో వింతలు!