తెలుగు వెండితెరతో పాటు హిందీ బుల్లితెరపై తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి విదిషా శ్రీవాస్తవ. ఈ ముద్దుగుమ్మ త్వరలోనే తల్లికాబోతోంది. ప్రస్తుతం ఆమె బేబీ బంప్స్ తో ఫోటో షూట్ చేసింది. గర్భంతో ఉన్న ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
తెలుగులో పలు సినిమాలు చేసిన విదిషా
‘బాబీజీ ఘర్ పర్ హైన్‘ సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది విదిషా శ్రీవాస్తవ. దీనితో పాటు పలు సీరియల్స్ లోనూ నటించి మెప్పించింది. తెలుగు సినిమా పరిశ్రమలోనూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, మలయాళ చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది. దక్షిణాది సినిమా పరిశ్రమలో బాగానే అభిమానులను సంపాదించింది. విదిషా 'మా ఇద్దరి మధ్య' అనే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ‘అలా‘ సినిమాలో నటించింది. అల్లరి నరేష్ తో కలిసి ‘అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ‘, శ్రీకాంత్ తో కలిసి ‘దేవరాయ‘ చిత్రాల్లో నటించింది. ఓకే ఏడాదిలో తెలుగులో ఆమె నటించిన మూడు చిత్రాలు రిలీజయ్యాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిట్ మూవీ ‘జనతా గ్యారేజ్‘లోనూ విదిషా కీలకపాత్రలో కనిపించింది. ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్ భార్య రియా పాత్రలో మెప్పించింది.
2018లో సాయక్ పాల్ తో విదిషా వివాహం
విదిషా శ్రీవాస్తవ 2018 డిసెంబర్‌లో సాయక్ పాల్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. త్వరలోనే బిడ్డకు జన్మినివ్వబోతున్నట్లు బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను నెట్టింట్లో షేర్ చేసింది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విదిషా, జూలైలో తమ మొదటి బిడ్డను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. తాజాగా బేబీ బంప్స్ షూట్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
డెలివరీ తర్వాత కొంత కాలం పాటు షూటింగులకు దూరం
యూపీకి చెందిన విదిషా డెలివరీ తర్వాత ముంబైకి వెళ్లనున్నట్లు విదిషా వెల్లడించింది. ఇకపై అక్కడే నివాసం ఉండబోతున్నట్లు తెలిపింది. ఇక తన ప్రెగ్నెన్సీ గురించి కూడా కీలక విషయాలు వెల్లడించింది. ప్రెగ్నెన్సీ కోసం ఎలాంటి ఫ్లాన్స్ చేసుకోలేదని చెప్పింది. ప్రెగ్నెన్సీ కన్ఫార్మ్ అయ్యాక, తన భర్త నుంచి ఎంతో సహకారం లభించిందని చెప్పుకొచ్చింది. గతంలో ఓ షోలో చేరానని, చేరాక 10 నెలలకే గర్భం దాల్చినట్లు తెలిసిందన్నారు. ఈ విషయాన్ని బయటకు చెప్పేందుకు చాలా ఇబ్బంది పడినట్లు చెప్పింది. కానీ, ఆ తర్వాత అందరికీ చెప్పడంతో షోలోని వారంతా తనకు శుభాకాంక్షలు చెప్పారని విదిషా వెల్లడించింది. డెలివరీ తర్వాత కొంత కాలం పాటు తాను సినిమాలు, సీరియల్స్ కు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మళ్లీ యథావిధిగా తన వృత్తి కొనసాగించనున్నట్లు తెలిపింది. విదిషా సోదరి శాన్వి కూడా హీరోయిన్ గా రాణిస్తోంది. ఆమె తెలుగులో పలు సినిమాలు చేసింది. అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
Read Also: ‘ఆదిపురుష్’పై నటి కస్తూరి షాకింగ్ కామెంట్స్, నిప్పులు చెరుగుతున్న ప్రభాస్ ఫ్యాన్స్!