సీరియల్ నటి నవ్య స్వామి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. మొదట కన్నడ సీరియల్స్ తో బుల్లితెర రంగానికి పరిచయమైన నవ్య స్వామి ఆ తర్వాత 'నా పేరు మీనాక్షి' అనే సీరియల్ తో తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. నా పేరు మీనాక్షి సీరియల్ మంచి సక్సెస్ అవ్వడంతో ఆ తర్వాత 'ఆమె కథ' అనే సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఆ తర్వాత తెలుగులో పలు సీరియల్స్ లో నటించింది. అయితే గత కొంతకాలంగా సీరియల్స్ కి బ్రేకిచ్చి ఇప్పుడు సినిమాల్లో తెగ బిజీ అయిపోయింది. ఈ మధ్యకాలంలో నవ్య స్వామి పలు వెబ్ సిరీస్, సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. రీసెంట్ గా 'బుట్ట బొమ్మ' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈమె ఇప్పుడు 'ఇంటింటి రామాయణం' అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ప్రముఖ కమెడియన్ రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి జంటగా సురేష్ నారెడ్ల దర్శకత్వం వహిస్తున్న 'ఇంటింటి రామాయణం' చిత్రం జూన్ 9న థియేటర్ లో విడుదల కాబోతోంది.
తాజాగా విడుదల చేసిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ సినిమా విడుదల సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా నవ్య స్వామి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. తను సీరియల్స్ మానేయడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు తాజా ఇంటర్వ్యూలో నవ్య స్వామి మాట్లాడుతూ.. "ఇంటింటి రామాయణం సినిమాలో తన క్యారెక్టర్ పక్కింటి అమ్మాయిలా, కాస్త అమాయకంగా ఉంటుందని.. సినిమా కూడా మన ఇంట్లో జరిగే కథలాగే అనిపిస్తుందని చెప్పుకొచ్చింది. ఇక తాను సినిమాల్లోకి రావాలనే ఉద్దేశంతోనే సీరియల్స్ చేయడం మానేశానని, అలా సీరియల్స్ కి బ్రేక్ ఇచ్చి సినిమాల్లో చేయాలని అనుకునే సమయంలోనే ఇంటింటి రామాయణం ఆఫర్ వచ్చిందని పేర్కొంది. అయితే ముందుగా డైరెక్టర్ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం నన్ను సెలెక్ట్ చేసుకోవడానికి కాస్త ఆలోచించారు. ఆ తర్వాత ఆడిషన్ ఇచ్చాక ఈ పాత్రకు నేనే సెట్ అవుతానని నన్ను ఓకే చేశారు" అని తెలిపింది.
ఇక ఆ తర్వాత మీలాగే మీ ఫ్రెండ్ రవి కృష్ణ కూడా సీరియల్స్ కి బ్రేక్ ఇచ్చి రీసెంట్‌గా విరూపాక్షతో మంచి హిట్ అందుకొని ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఫ్యూచర్లో మీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించే అవకాశం ఉందా? అని యాంకర్ అడగగా.. "మంచి రోల్స్ వస్తే ఖచ్చితంగా నటిస్తామని చెప్పింది నవ్య స్వామి. నిజానికి నా కన్నా ముందే రవి కృష్ణ సినిమాల్లో నటించాలని ప్రయత్నాలు చేశాడు. కానీ టీవీ ఛానల్ వాళ్ళు ఇబ్బంది పెట్టడంతో తాను సీరియల్ చేయడానికి ఒప్పుకున్నాడు. అంతేకానీ మేము ఒకేసారి అనుకొని ప్లాన్ చేసి సీరియల్స్ కి బ్రేక్ ఇవ్వలేదు. అది యాదృచ్ఛికంగా జరిగింది" అంటూ చెప్పుకొచ్చింది.
ఇక ఇంటింటి రామాయణం సినిమా విషయానికొస్తే.. పల్లెటూరు నేపథ్యంలో సాగే జెన్యూన్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్, గంగవ్వ, బిత్తిరి సత్తి, అంజి తదితరులు కీలక పోషించారు. నాగ వంశీ సమర్పణలో ఆహా స్టూడియోస్, మారుతి టీం వర్క్స్ బ్యానర్లపై వెంకట్ ఉప్పుటూరి - గోపీచంద్ ఈ సినిమా నిర్మించారు. నిజానికి ఈ సినిమాని ఆహా ఓటీటీలోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ ఏమైందో తెలియదు ఇప్పుడు థియేటర్స్ లో జూన్ 9న రిలీజ్ చేస్తున్నారు.
Also Read: హీరో, హీరోయిన్లను కొట్టడం పై తేజకి ప్రశ్న - దర్శకుడి ఆన్సర్‌కి పారిపోయిన ‘జబర్దస్త్’ కమెడియన్!