'భద్రం కొడుకో' అనే చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన తెలుగమ్మాయి లయ.. 'స్వయంవరం' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 'మనోహరం', 'మనసున్న మారాజు', 'హనుమాన్ జంక్షన్', 'మిస్సమ్మ', ప్రేమించు, శివ రామరాజు, నాలో ఉన్న ప్రేమ, నీ ప్రేమకై, టాటా బిర్లా మధ్యలో లైలా వంటి చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుంది. మనోహరం, ప్రేమించు చిత్రాలలో ఉత్తమ నటనకు గాను ఆమెకు నంది అవార్డ్స్ కూడా వరించాయి. 


తెలుగులో కాకుండా తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లోనూ నటించింది లయ. అయితే వివాహ బంధంలో అడుగుపెట్టిన తర్వాత ఆమె, సినిమాలు తగ్గిస్తూ వచ్చింది. 2010లో 'బ్రహ్మ లోకం టూ యమలోకం వయా భూలోకం' చిత్రంలో కనిపించిన లయ.. ఆ తర్వాత పూర్తిగా సినీ ఇండస్ట్రీకి దూరమైంది. అయితే 2018లో 'అమర్ అక్బర్ ఆంటోని' మూవీలో అతిథి పాత్రలో మెరిసింది. తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గొన్న లయ.. వివాహానంతరం నటనకు దూరంగా ఉండటానికి గల కారణాలను వివరించింది.


లయ మాట్లాడుతూ.. సినిమాలలో నటించవద్దని తన భర్త ఎప్పుడూ చెప్పలేదని తెలిపింది. హీరోయిన్ గా ఉన్నప్పుడు అక్కడికి ఇక్కడికి ట్రావెల్ చేయాల్సి వస్తుంది.. ఫ్యామిలీ లైఫ్ లో అది కష్టమని అనిపించి ఇండస్ట్రీకి దురమయ్యానని చెప్పింది. అమెరికాలో పెద్ద డాక్టర్ అయినా తన భర్త ఇన్వెస్టిమెంట్స్ చూసుకోవడానికే తనకు సమయం సరిపోతుందన్నారు. 2011 నుంచి 2017 వరకు ఐటీ జాబ్ చేశానని చెప్పారు. ఆ తర్వాత నాలుగేళ్ల విరామం తీసుకుని, డ్యాన్స్ స్కూల్ పెట్టానని.. కోవిడ్ కారణంగా అది కాస్త డౌన్ అయిందని తెలిపింది. తమకు అమెరికాలో బాగానే ఆస్తులు ఉన్నాయని.. కానీ, డబ్బులు ఆస్తుల కంటే చిన్న చిన్న విషయాలే ఎంతో సంతోషాన్ని ఇస్తాయని చెప్పింది.


2006లో డాక్టర్ శ్రీగణేశ్ గోర్తిని వివాహం చేసుకుని, కాలిఫోర్నియాలో సెటిల్ అయ్యారు లయ. అయితే తమది లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ అనుకోవచ్చని అంటోంది. వీరికి 14 ఏళ్ల కుమార్తె, 12 ఏళ్ల ఒక కుమారుడు ఉన్నారు. ఇప్పటికే కూతురు 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. అయితే ఛాన్స్ వస్తే హీరోయిన్ గా తన కుమార్తె ఒక్క సినిమా అయినా చేస్తే చూడాలనేది తల్లిగా తన కోరిక అని లయ తెలిపింది. తన పిల్లలిద్దరికీ తెలుగు నేర్పిస్తున్నట్లు కూడా చెప్పింది.


ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి తాను నటించలేదని, అయినా తన పెళ్లికి ఆహ్వానిస్తే వచ్చారని లయ ఇదే ఇంటర్వ్యూలో తెలిపింది. పవన్ తో పరిచయం లేకపోయినా తన పేరు తెలిసి ఉంటుందనే ఉద్దేశంతో పెళ్లికి రమ్మని పిలిచానని.. అందరి కంటే ముందే వివాహ వేడుకకు వచ్చి సర్ప్రైజ్ చేశారన్నారు. తనతో పరిచయం లేకపోయినా, పిలిచిన వెంటనే వచ్చారని.. అదే ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ వస్తారని అనుకోలేదని.. ముందుగా తెలియకపోవడంతో మర్యాదలు కూడా సరిగ్గా చేయలేకపోయామని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా తన మ్యారేజ్ కు వచ్చారనే విషయాన్ని లయ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.