Actress Gayathri Gupta: దేశ వ్యాప్తంగా సినిమా పరిశ్రమలో కొనసాగుతున్న లైంగిక వేధింపుల గురించి చాలా కాలంగా చర్చ జరుగుతూనే ఉంది. #MeToo పేరుతో పలువురు నటీమణులు తమకు ఎదురైన వేధింపుల గురించి ధైర్యంగా నోరువిప్పారు. అవకాశాలు ఇస్తామని చెప్పి తమను శారీరకంగా ఎలా వాడుకున్నారో వివరించారు. మరికొంత మంది కెరీర్ కోసం ఎలా లొంగిపోవాల్సి వచ్చిందో చెప్పారు. ఇండస్ట్రీలో ప్రతి నటికి ఏదో ఒక రకంగా కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురయ్యే ఉంటుందని చాలా మంది అభిప్రాయపడ్డారు.


బలయ్యేది అమాయకపు అమ్మాయిలే!


టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ గురించి బలంగా తన వాయిస్ వినిపించిన నటి గాయత్రి గుప్త. అప్పట్లో తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి బయటకు చెప్పి సెన్సేషనల్ అయ్యింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మరోసారి కాస్టింగ్ కౌచ్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో తాను కాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకంగా పోరాడినా అనుకున్న స్థాయిలో సపోర్టు దొరకలేదని చెప్పింది. ఆ తర్వాత మరికొంత మంది కాస్టింగ్ కౌచ్ గురించి కామెంట్స్ చేయడంతో ఇండస్ట్రీలో ఓ కమిటీ వేసినట్లు వెల్లడించింది. ఇప్పుడు చాలా మంది బాధితులకు అదో వేదికగా మారిందని చెప్పుకొచ్చింది.


“ఇండస్ట్రీలో చాలా కాలంగా కాస్టింగ్ కౌచ్ ఉంది. చాలా మంది స్టార్ హీరోయిన్లు అవకాశాల కోసం ఇష్టంతోనే ఆ రకమైన పనులు చేస్తున్నారు. మరికొంత మంది అవసరాల కోసం చేస్తున్నారు. చాలా మంది అమాయక అమ్మాయిలకు అవకాశాల ఎర చూపి శారీరకంగా వాడుకుంటున్నారు. చివరకు అవకాశాలు రాక, బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు” అని చెప్పుకొచ్చింది.


అప్పట్లో కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన గాయత్రి


టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందని మొదట గళం ఎత్తిన అమ్మాయే గాయత్రి గుప్త. అవకాశాలు ఇస్తామని తనను చాలా మంది మోసం చేశారని అప్పట్లో సంచనల వ్యాఖ్యలు చేసింది. ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకంగా ఆందోళన చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలను బ్యాన్ చేయాలంటూ పోరాటం చేసింది. ఆ తర్వాత ఈ విషయం గురించి అందరూ నెమ్మదిగా మర్చిపోయారు.


యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన గాయత్రి గుప్తా


గాయత్రి గుప్త.. టీవీ షోల ద్వారా కెరీర్ మొదలు పెట్టింది. ఆ తర్వాత యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. నెమ్మదిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. 'ఫిదా', 'ఐస్‌ క్రీమ్ 2', 'కొబ్బరిమట్ట', 'మిఠాయి' లాంటి సినిమాల్లో నటించింది. 'పెళ్లికి ముందు', 'సీత ఆన్ ద రోడ్' లాంటి లఘు చిత్రాల్లోనూ నటించింది. ఆ తర్వాత 'అన్‌స్టాపబుల్', 'ప్లాట్', 'డబుల్ ఇంజిన్' లాంటి సినిమాలు చేసింది. ఆమె చివరగా నటించిన 'దయా' వెబ్ సిరీస్‌  బాగా పాపులర్ అయ్యింది. అయినప్పటికీ గాయత్రికి అనుకున్న స్థాయిలో అవకాశాలు రావడం లేదు.


Read Also: మాసిన గడ్డం, నోట్లో సిగరెట్ - అల్లరి నరేష్ ‘బ‌చ్చల మ‌ల్లి’ ఫస్ట్ లుక్ అదుర్స్ అంతే!