Actress Aksha Ties The Knot With Kaushal Shah: కుర్రకారును తమ అందాలతో అలరించిన హీరోయిన్లు ఒక్కొక్కరుగా వివాహ బంధంలోకి అడుగుపెట్టేస్తున్నారు. మనసుకు నచ్చిన వాడితో మూడుముళ్ల బంధంతో ఒకటైపోతున్నారు. ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన ముంబై బ్యూటీ అక్ష సినిమాటోగ్రాఫర్ ని పెళ్లి చేసుకుంది. గత కొద్దికాలంగా ప్రేమించుకుంటున్న ఈ ఇద్దరు వివాహ బంధంతో ఒకటయ్యారు. వాళ్ల పెళ్లికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రార్థనలు ఫలించినప్పుడు.. హృదయాలు ఒకటవుతాయి..
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన అక్ష ఆ తర్వా త తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది. 2017 నుంచి ఆమె టాలీవుడ్ లో కనిపించలేదు. ఆ తర్వాత హిందీలో వెబ్ సిరీస్ లు తీయడం మొదలు పెట్టింది. ఆ సమయంలోనే సినిమాటోగ్రాఫర్ కౌషల్ తో పరిచయం ఏర్పడింది ఆమెకి. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఫిబ్రవరి 26న వీళ్ల పెళ్లి ఘనంగా జరిగింది. దానికి సంబంధించి ఫొటోలను షేర్ చేశారు అక్ష. "ప్రార్థనలు ఫలించినప్పుడు.. హృదయాలు ఒకటవుతాయి. దేవుడు, మా తల్లిదండ్రులు, నామేలు కోరే వారి సమక్షంలో, వాళ్ల ఆశిస్సులతో మేం ఒకటయ్యాం" అంటూ ఫొటోలు పోస్ట్ చేసింది అక్ష. ఇప్పుడు ఆఫొటోలు వైరల్ గా మారాయి.
తెలుగులో హిట్ సినిమాలు..
తన 8వ తరగతిలోనే మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అక్ష. ఇక ఆ తర్వాత 2004లో 'ముసాఫిర్' అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది. 'రైడ్', 'అది నువ్వే', 'కందిరీగ', 'శత్రువు', 'రయ్ రయ్', 'బెంగాల్ టైగర్', 'డిక్టేటర్', 'మెంటల్ పోలీస్', 'రాధా' తదితర తెలుగు చిత్రాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా నటించింది అక్ష. ఈమె ఇప్పటివరకు దాదాపు 75 యాడ్స్ లో కూడా నటించారు. 2017 తర్వాత ఆమె తెలుగు తెరపై కనిపించలేదు. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో వెబ్ సిరీస్ చేయడం మొదలుపెట్టింది. 'జమత్ర', 'కాట్మాండూ కనెక్షన్', 'రూపుచక్కర్' లాంటి వెబ్ సిరీస్ చేసింది. ఇక ఆ టైంలోనే కౌషల్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం బాలీవుడ్ వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది అక్ష.
గోవాలో గ్రాండ్ వెడ్డింగ్...
డెస్టినేషన్ వెడ్డింగ్ అంటేనే గ్రాండ్ వెడ్డింగ్ అని అర్థం. ఎన్నో స్పెషల్స్ ఉంటాయి వాళ్ల పెళ్లిలో. అలా అక్ష, కౌషల్ పెళ్లి కూడా గ్రాండ్ గా జరిగింది. కొద్దిమంది బంధువులు, సన్నిహితులు మధ్య ఈ తంతు నిర్వహించారు. అయితే, కౌషల్ సినిమాటోగ్రాఫర్ కావడంతో పెళ్లిని చాలా సినిమాటిక్ గా డిజైన్ చేశాడు. దానికి సంబంధించిన స్పెషల్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లికొడుకు ఎంట్రీ చాలా ఫన్నీగా జరిగింది. సినిమాటోగ్రాఫర్ కావడంతో కెమెరా క్రేన్ తో ఎంట్రీ ఇచ్చాడు పెళ్లికొడుకు. దీంతో ఆ వీడియోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. "కెమెరా మెన్ అనిపించుకున్నావు బ్రో " అంటూ కామెంట్లు పెడుతున్నారు చాలామంది.