Actress Aamani: ఇప్పటికీ సినీ పరిశ్రమలో ఆడవాళ్లు, నటీమణులు ఎదుర్కుంటున్న ఇబ్బందుల గురించి ఎంతోమంది బయటపెట్టారు. చాలామంది వాటిని ఖండించారు కూడా. ఇక తాజాగా సీనియర్ హీరోయిన్ ఆమని కూడా ఈ విషయంపై మాట్లాడారు. అంతే కాకుండా తన పర్సనల్ లైఫ్ గురించి పలు విషయాలు షేర్ చేసుకున్నారు. హిందుత్వాన్ని ఫాలో అయ్యే తను ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్నా కూడా పూజలు చేస్తానని, మతం మారడం లాంటివి తను నమ్మనని తెలిపారు ఆమని. తన పిల్లలతోనే లైఫ్ బిజీ అయిపోయిందని, షూటింగ్‌లో కంటే ఇంట్లోనే ఎక్కువ బిజీగా ఉంటానని చెప్పుకొచ్చారు.
అలా అడిగారు..
సావిత్రి కాలం నుంచి హీరోయిన్లకు ఇబ్బందులు అనేవి ఉన్నాయని, కాకపోతే అప్పట్లో సోషల్ మీడియా అనేది లేదు కాబట్టి అవి బయటికి వచ్చేవి కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు ఆమని. సోషల్ మీడియా అనేది వచ్చిన తర్వాత చిన్న విషయాన్ని కూడా పెద్దగా చూపిస్తున్నారని అన్నారు. ఏ ప్రొఫెషనల్‌లో అయినా మంచి చెడు అనేది ఉంటుందని, అందరు హీరోయిన్లు కష్టపడే ఇండస్ట్రీకి వస్తారని తెలిపారు. తమిళంలో తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను ఎదుర్కున్నానని బయటపెట్టారు. కొందరు అయితే అమ్మ, అన్నయ్య ముందే డ్రెస్ తీసి చూపించమంటారని ఓపెన్‌గా చెప్పుకొచ్చారు ఆమని. అలా అనగానే లేచి వచ్చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు.
ఉన్న సమస్యలు చాలు..
‘‘అందరూ హీరోయిన్ అవ్వాలనే ఆశతోనే వస్తారు. అలాంటి సమయంలో వాళ్లకు అలాంటి చేదు అనుభవాలు ఎదురైతే పాపం వాళ్లు మాత్రం ఏం చేస్తారు?’’ అంటూ ఆడవాళ్లు కాంప్రమైజ్ అవుతున్న సందర్భాల గురించి మాట్లాడారు ఆమని. ‘మీ టూ’ మూమెంట్‌లో తాను పాల్గొనలేదని, తనకు ఇంట్లో ఉన్న సమస్యలు చాలు అని నవ్వుతూ చెప్పారు. తన పిల్లలతో ఎప్పుడూ బిజీగా ఉంటానని తెలిపారు. పర్సనల్ లైఫ్‌లో తను తెలిసి తెలియక చేసిన తప్పుల గురించి చెప్పమనగా.. ‘‘హీరోయిన్ అవ్వడానికి ఏం ఎదుర్కోవాలో ఎదుర్కొని హీరోయిన్ అయ్యాను. ఏదైనా నెగిటివ్ అనిపిస్తే దూరంగా ఉండేదాన్ని. పెళ్లి తర్వాత కూడా టెన్షన్స్ ఏం లేవు. ఎలా ఉండాలి అనుకుంటున్నానో అలాగే ఉంటున్నాను’’ అని చెప్పారు ఆమని.
అలా నేను అనను..
హిందుత్వాన్ని నమ్మే ఆమని ఒక ముస్లిం వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంది అని అడగగా.. ‘‘నేను మతాలను నమ్మను. పూజలు, ధ్యానం చేయడం నాకు ఇష్టం. అలా అని వేరేవాళ్లను కూడా అలాగే చేయమని నేను అనను. ఎవరినైనా పెళ్లి చేసుకో సినిమా ఇండస్ట్రీని మాత్రం వదలకు అని అమ్మ చెప్పింది. ఎందుకంటే నేను హీరోయిన్ అవ్వడం కోసం అమ్మ కష్టపడింది. ఇప్పటికీ తను టీవీలో నా సినిమాలు మాత్రమే చూస్తుంటుంది. ప్రొఫెషన్ తర్వాత నాకు ఫ్యామిలీ చాలా ముఖ్యం. అందుకే కాస్త బ్రేక్ వచ్చినా కూడా పిల్లల దగ్గరకు వెళ్లిపోతుంటాను’’ అని తెలిపారు. యంగ్ జెనరేషన్ నటులతో నటించే ఛాన్స్ వస్తే చేస్తానని, అందరిలో తనకు ఎన్‌టీఆర్ అంటే ఎక్కువ ఇష్టమని బయటపెట్టారు. ఆయన హోస్ట్ చేసినందుకే బిగ్ బాస్ చూశానని తెలిపారు ఆమని.
Also Read: అమ్మ లేకుండా అక్కడికి రమ్మని పిలిచేవాళ్లు, చిరంజీవి గురించి కలలు కనేదాన్ని - ఆమని