Actor Vishal: 'మార్క్ ఆంటోనీ' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన యాక్షన్ హీరో విశాల్, ప్రస్తుతం ‘రత్నం’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ మాస్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్లు విశాల్ మంగళవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ యాక్షన్ ప్రియులందరికీ పండుగలా ఉంటుందని, త్వరలోనే ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.
‘రత్నం’ పూర్తి..
''రత్నం షూటింగ్ మొత్తం పూర్తయింది. దర్శకుడు హరి సర్‌తో, డార్లింగ్ డిఓపి సుకుమార్ అండ్ మొత్తం యూనిట్‌తో కలిసి మూడవసారి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. టుటికోరిన్, తిరుచ్చి, కారైకుడి, వెల్లూరు, తిరుపతి, చెన్నై వంటి ప్రాంతాల్లో పూర్తి సానుకూల వాతావరణంలో పని చేయడం నాకొక మంచి జ్ఞాపకం. స్టోన్ బెంచర్స్ నిర్మాత కార్తీక్ అండ్ టీమ్ కి కృతజ్ఞతలు. డార్లింగ్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన అద్భుతమైన పాటలను విడుదల చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది యాక్షన్ ప్రియులందరికీ పండుగలా ఉంటుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మీకు సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తూనే మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. ఇది సమ్మర్ ట్రీట్ కావచ్చు. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ రావొచ్చు. థాంక్యూ'' అని విశాల్ ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ హరి, సినిమాటోగ్రాఫర్ ఎమ్. సుకుమార్ లతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు.
‘భరణి’, ‘పూజ’ లాంటి విజయవంతమైన చిత్రాల తర్వాత విశాల్ - హరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో 'రత్నం' పై అభిమానుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టుగానే ఇప్పటికే రిలీజ్ చేయబడిన ఫస్ట్ లుక్, లిరికల్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. జీ స్టూడియోస్ సమర్పణలో స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2024 సమ్మర్ హాలిడేస్ లో తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
'డిటెక్టివ్ 2' పై ఫోకస్...
ఇదిలా ఉంటే 'రత్నం' సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ''డిటెక్టివ్ 2'' మూవీ మీద ఫోకస్ పెట్టారు విశాల్. ట్విట్టర్ డీపీ చేంజ్ చేయడం ద్వారా ఈ విషయాన్ని స్పష్టం చేసారు. మిస్కిన్ దర్శకత్వంలో రూపొందిన 'డిటెక్టివ్' చిత్రం తెలుగులోనూ మంచి విజయాన్ని సాధించింది. అయితే దర్శక హీరోల మధ్య తలెత్తిన వివాదాల కారణంగా డైరెక్టర్ ను తొలగించి, సీక్వెల్ కు దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు విశాల్. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
స్వతహాగా తెలుగువాడైన విశాల్ 'పందెం కోడి' 'పొగరు' 'భరణి' 'వాడు వీడు' 'పల్నాడు' 'రాయుడు' 'పూజ' 'అభిమన్యుడు' 'డిటెక్టివ్' వంటి చిత్రాలతో టాలీవుడ్ లోనూ మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. కానీ 'పందెం కోడి 2' 'యాక్షన్' 'చక్ర' 'ఎనిమీ' 'సామాన్యుడు' 'లాఠీ' లాంటి సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. అయితే గతేడాది 'మార్క్ ఆంటోనీ' మూవీతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలో ‘రత్నం’, 'డిటెక్టీవ్ 2' చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్దమవుతున్నాడు. మరి ఈ సినిమాలు విశాల్ కు ఎలాంటి సక్సెస్ అందిస్తాయో చూడాలి.
Also Read: కీర్తి సురేష్ 'సైరెన్' మోగేది ఓటీటీలో కాదు, థియేటర్లలోనే..!