Prasanna Vadanam Teaser Out: తెలుగు సినిమా పరిశ్రమలో నటుడు సుహాజ్ వరుస సినిమాలో సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తున్నాడు. షార్ట్ ఫిలిమ్స్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన సుహాస్, ఇప్పుడు హీరోగా ఫుల్ బిజీ అయ్యాడు. ‘కలర్ ఫొటో’, ‘రైటర్ పద్మభూషణ్’, ‘హిట్ 2’, ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సరికొత్త కథలతో వరుస హిట్స్ అందుకుంటున్నాడు. రీసెంట్ గా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్’ మూవీతో చక్కటి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు ‘ప్రసన్న వదనం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
సరికొత్త కాన్సెప్ట్ తో ఆకట్టుకుంటున్న టీజర్
అర్జున్ వైకే దర్శకత్వం వహిస్తున్న ‘ప్రసన్న వదనం’ సినిమాలో పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లిటిల్ థాట్స్ సినిమాస్, అర్హ మీడియా సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి. మణికంఠ, ప్రసాద్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినియాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. సుహాస్ తలకు కట్టుతో ఆస్పత్రిలో ఉన్న సీన్ తో టీజర్ ప్రారంభమైంది. డాక్టర్ సుహాస్ తల్లిదండ్రుల ఫోటోను చూపించి వీళ్లు ఎవరు? అని అడుగుతాడు. వారిని హీరో గుర్తుపట్టలేకపోతాడు. సుహాన్ ‘ఫేస్ బ్లైండ్ నెస్’ అనే సరికొత్త సమస్యతో హీరో బాధపడుతున్నట్లు డాక్టర్ చెప్తాడు. ఈ వ్యాధి వచ్చిన వారు ఒక వ్యక్తికి సంబంధించి ముఖం తప్ప అన్ని గుర్తుపడతారు. అసలు ఈ సమస్య సుహాస్ కు ఎలా వచ్చింది? దాని నుంచి అతడు ఎలా బయటపడతాడు? అనేది విషయాన్ని ఆసక్తికరంగా చూపించబోతున్నారు. టీజర్ మధ్యలో సినిమాలోని అన్ని పాత్రలను పరిచయం చేశారు. ప్రతీ సీన్ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అయితే, సినిమా కథ ఎక్కడా రివీల్ కాకుండా మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ‘ప్రసన్న వదనం’ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిస్తున్నట్లు టీజర్ చూస్తే అర్థం అవుతుంది. టీజర్ లో సుహాస్ వ్యాధి, మిగతా పాత్రల చుట్టూ ఉన్న సస్పెన్స్ ఆసక్తి కలిగిస్తోంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంట్రెస్టింగ్‌గా సాగిన ఈ టీజర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఓటీటీలో దుమ్మురేపుతున్న ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’
ఇక ఇటీవల విడుదలైన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ థియేటర్లలో సక్సెస్ అందుకోవడంతో పాటు, ఓటీటీలోనూ సత్తా చాటుతోంది. మార్చి 1 నుంచి ‘ఆహా’లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తొలి ఐదు రోజుల్లోనే 10 కోట్ల నిమిషాల వ్యూస్ ను అందుకుంది. దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శివాని నాగరం హీరోయిన్ గా నటించింది. శరణ్య ప్రదీప్, నితిన్ ప్రసన్న, 'పుష్ప' ఫేమ్ జగదీశ్ ప్రతాప్ బండారి ప్రధాన పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది.