Actor Sivaji As A Villan Role In Court Movie And Started Second Innings: టాలీవుడ్ హీరో శివాజీ (Sivaji) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి అటు బుల్లితెర నుంచి ఇటు సిల్వర్ స్క్రీన్ వరకూ తన నటనతో మెప్పించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తొలుత డబ్బింగ్ ఆర్టిస్టుగా ఇతర హీరోలకు వాయిస్ కూడా అందించి ఆ తర్వాత అంచెలంచెలుగా తన టాలెంట్, కృషితో హీరోగా ఎదిగారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

చాలా గ్యాప్ తర్వాత బిగ్ బాస్ ఎంట్రీ

ఆ తర్వాత సినిమాలకు చాలా కాలం దూరంగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. పొలిటికల్ పరంగానూ తన ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ షోలో ఆయన వ్యక్తిత్వం చూసి చాలామంది శివాజీకి ఫ్యాన్స్ అయిపోయారు. ఆ తర్వాత 'ఈటీవీ విన్' ఓటీటీలో #90s (మిడిల్ క్లాస్ బయోపిక్) వెబ్ సిరీస్‌తో అటు పిల్లల నుంచి ఇప్పటి పెద్దల వరకూ అందరినీ ఆకట్టుకున్నారు. ఓ మధ్య తరగతి తండ్రిగా.. 90sలో ప్రతీ కుటుంబంలో జరిగే కథలో తన నటనతో మెప్పించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. టీచర్ పాత్రలో ఆయన నటనకు ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు.

'కోర్ట్'లో విలన్‌గా..

ఎన్నో ఏళ్ల తర్వాత శివాజీ మళ్లీ 'కోర్ట్: ద స్టేట్ వర్సెస్ నోబడీ' (Court: The State Versus Nobody) సినిమాలో విలన్‌గా ఎంట్రీ ఇచ్చారు. నాని నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీలో ప్రియదర్శి (Priyadarshi) ప్రధాన పాత్ర పోషించగా.. యువ దర్శకుడు రామ్ జగదీశ్ తెరకెక్కించారు. ఈ సినిమాలో 'మంగపతి' రోల్‌లో తన నటనతో మరోసారి ఆకట్టుకున్నారు శివాజీ. మంగపతి (Mangapati) అనే పాత్రలో నటించారు అనడం కంటే జీవించారు అని చెప్పవచ్చు. స్క్రీన్ మీద శివాజీ కనపడిన ప్రతిసారి ఆయన నటన, డైలాగ్ డెలివరీకి అభిమానులు ఫిదా అయిపోయారు. 

ఓ పేదింటి యువకుడు పెద్దింటి అమ్మాయిని ప్రేమించగా.. ఆ యువకునికి చెక్ పెట్టే అమ్మాయి మామయ్య పాత్రలో శివాజీ ఒదిగిపోయారు. మనం రియాలిటీలో చూసిన కొన్ని పాత్రలకు ఆపాదించుకునేలా ఆ రోల్ ఉండటంతో చాలామంది 'మంగపతి' క్యారెక్టర్‌కు కనెక్ట్ అయిపోతున్నారు. పరువు, ప్రతిష్టలనే ప్రాణంగా భావించే ఓ వ్యక్తి దాని కోసం ఎంత దూరమైనా వెళ్తారనే కాన్సెప్ట్‌లో శివాజీ ఇమిడిపోయారు. కోర్ట్ మూవీలో ఆయన నటన గురించి విశ్లేషకులు సైతం తమ రివ్యూస్‌లో స్పెషల్‌గా ప్రస్తావిస్తున్నారు. ఈ పాత్ర దెబ్బతో టాలీవుడ్‌లో విలన్ రోల్స్‌కు మరో హీరో దొరికేశాడంటూ నెటిజన్లు వరుస కామెంట్స్ చేస్తున్నారు.

నేచురల్ స్టార్ నాని సమర్పణలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో 'కోర్ట్' మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే పెయిడ్ ప్రీమియర్లు పడగా.. హిట్ టాక్ సొంతం చేసుకుంది. కొత్త దర్శకుడు రామ్ జగదీశ్ పోక్సో యాక్ట్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శివాజీ విలన్ రోల్ చేయగా.. సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, 'శుభలేఖ' సుధాకర్ ప్రధాన పాత్రలు పోషించారు. హార్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించారు.