Nikhil Siddharth: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నిఖిల్ సిద్దార్థ ఒకరు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. గతేడాది ‘కార్తికేయ 2’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నిఖిల్ ఇప్పుడు ‘స్పై’ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీకు బి హెచ్ గ్యారీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జూన్ 29 న దేశవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్ని నిఖిల్ తన కెరీర్ ను మలుపు తిప్పిన మూవీ ‘స్వామి రారా’ మూవీ గురించి చెప్పుకొచ్చారు. ఆ సినిమా తన కెరీర్ ను ఎలా మార్చిందో గుర్తు చేసుకున్నారు నిఖిల్. ప్రస్తుతం ఆయన చెేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


ఆ సమయంలో కార్ లో ఒంటరిగా దేశమంతా తిరిగాను: నిఖిల్


సినిమాల మీద ఇంట్రస్ట్ తో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నిఖిల్ సిద్ధార్థ్. 2007 లో వచ్చిన ‘హ్యాపీ డేస్’ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతకు మందు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినా గుర్తింపు రాలేదు. ‘హ్యాపీ డేస్’ తర్వాత వరుసగా ఫ్లాప్ లను చవిచూశాడు నిఖిల్. ఆ సమయంలో తనకు ‘స్వామి రారా’ సినిమా గొప్ప అవకాశం అని చెప్పారు. ఆ సినిమాకు ముందు ‘డిస్కో’ అనే సినిమా చేశానని, ఆ సినిమా ఫ్లాప్ కావడంతో అందరూ తనను విమర్శించారని వాపోయాడు. తర్వాత ఏం చేయాలో తెలియక ఓ రెండు మూడు నెలల పాటు కార్ లో ఒంటరిగా దేశమంతా తిరిగానని చెప్పాడు. సినిమాలు హిట్ అవ్వాలంటే పెద్ద డైరెక్టర్, పెద్ద నిర్మాత అని కాదని, మంచి కథ ఉండాలని అని తెలిసిందని అన్నారు. తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ తో కలసి 2013లో ‘స్వామి రారా’ అనే చిన్న సినిమా చేశానని అన్నారు. ఈ సినిమా కనుక హిట్ అవ్వకపోతే ఇంకో సినిమా చేసేవాడ్ని కాదేమోనని అన్నారు. ‘స్వామి రారా’ సినిమా తన కెరీర్ కు ఎంతో బూస్ట్ ఇచ్చిందని చెప్పుకొచ్చారు నిఖిల్.


వెయ్యికి పైగా స్క్రీన్ లలో నిఖిల్ ‘స్పై’ మూవీ


‘కార్తికేయ 2’ తర్వాత నిఖిల్ రేంజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. అందుకే ఇప్పుడు రాబోతున్న ‘స్పై’ మూవీను కూడా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేస్తున్నారు. దాదాపు వెయ్యికిపైగా స్క్రీన్ లలో ఈ మూవీ విడుదల చేస్తున్నారు. ఈడీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌ పై రాజశేఖర్ రెడ్డి కె ఈ సినిమాను నిర్మించారు. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా చేస్తుంది. ఆర్యన్ రాజేష్, మకరంద్ దేశ్‌పాండే, అభినవ్ గోమఠం తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ స్వరాలు సమకూర్చగా.. శ్రీచరణ్ పాకాల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. స్పై థ్రిల్లర్ యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నిఖిల్‌ కు ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో చూడాలి. ఈ మూవీను ప్రపంచ వ్యాప్తంగా జూన్ 29న విడుదల చేస్తున్నారు.


Also Read: విడుదలకు ముందే అదరగొడుతోన్న నిఖిల్ 'స్పై' - ఇదే ఫస్ట్ టైమ్!