Actor Allu Arjuns Legal team has moved a regular bail plea in Nampally court : హైదరాబాద్: టాలీవుడ్ నటుడు, పుష్ప 2 హీరో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో విచారణకు వర్చువల్‌గా హాజరయ్యారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య 70ఎంఎం థియేటర్ వద్ద తొక్కిసలాట (Sandhya Theatre Incident) ఘటనలో అల్లు అర్జున్ నేడు మరోసారి నాంపల్లి కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఇటీవల అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. నేటితో 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ ముగియనుంది. అదే రోజు హైకోర్టుకు వెళ్లడంతో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. రిమాండ్ రిపోర్టు పూర్తి కావడంతో, దానిపై విచారణ నిమిత్తం కోర్టుకు నటుడు హాజరుకావాల్సి ఉండగా... వర్చువల్ హాజరుకు లాయర్లు అనుమతి కోరారు. కోర్టు ఓకే చెప్పడంతో అల్లు అర్జున్ వర్చువల్‌గా కేసు విచారణకు హాజరయ్యారు. అల్లు అర్జున్ వస్తున్నారని పోలీసులు కోర్టు వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.


నాంపల్లి కోర్టులో రెగ్యూలర్ బెయిల్ పిటిషన్ దాఖలు


ఇదే కేసులో అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ఇవ్వగా.. ఆయన లాయర్లు రెగ్యూలర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు తెలపనున్నారు. రెగ్యూలర్ బెయిల్ పిటిషన్ విచారణ చేపట్టి, అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేయాలని కోరనున్నారు.


రేవతి కుటుంబానికి రూ.2 కోట్ల ఆర్థికసాయం


ఇదివరకే బాధితురాలు రేవతి కుటుంబానికి నటుడు అల్లు అర్జున్ ఆర్థిక సాయం చేశారు. అల్లు అర్జున్ రూ. 1కోటి రూపాయల చెక్ అందించగా, పుష్ప 2 దర్శకుడు సుకుమార్ రూ.50 లక్షలు, నిర్మాతలు రూ.50 లక్షలు సాయం చేశారు. వీటికి సంబంధించిన చెక్కులను ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజును అందజేశారు. 


Also Read: Allu Arjun: పుష్పరాజ్‌ ఒక్క ఏడాదిలో ఎంత ఆదాయ పన్ను చెల్లించాడో తెలుసా?