Godhra Teaser Out: బాలీవుడ్ మరో కాంట్రవర్సీయల్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. ఇప్పటికే 1990లలో కశ్మీరీ పండితుల ఊచకోతపై గత ఏడాది 'ది కశ్మీరీ ఫైల్స్', కేరళలో లవ్ జిహాద్ పై 'ది కేరళ స్టోరీ' సినిమాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇప్పుడు 2002లో జరిగిన గోద్రా రైలు దగ్ధం, అల్లర్లకు సంబంధించిన కథతో యాక్సిడెంట్ ఆర్ కాన్స్పిరసీ: గోద్రా సినిమా వస్తోంది. గోద్రా ఈ పేరు వినగానే గుర్తోచ్చేది గుజరాత్ రైలు యాక్సిడెంట్. 21 ఏళ్ల క్రితం జరిగిన సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు దహనం, ఆ తర్వాత గుజరాత్ లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో మూవీని తెరక్కిస్తున్నారు.
గోద్రా ఘటన ప్రమాదమా లేక కుట్ర..
తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. నిజ జీవిత సంఘటన ఆధారం వస్తోన్న ఈ మూవీ టీజర్ ఆద్యాంతంగా ఆసక్తిగా సాగింది. దాదాపు నిమిషం నిడివి గల ఈ టీజర్‌లో ఒక్క డైలాగ్ లేకుండా ఆసక్తిగా మలిచారు. 2002లో జరిగిన గోద్రా రైలు దహనం గురించి ముఖ్యమైన వివరాలను మాత్రం సబ్ టైటిల్స్ రూపంలో చూపించారు. చివరికి అసలు గోద్రా ఘటన ప్రమాదమా లేక కుట్ర అంటూ టీజర్ ముగించారు. చూస్తుంటే గోద్రా మూవీ ద్వారా అధికార పార్టీ తమ వాదనను ప్రజల ముందుకు తీసుకెళ్లబోతోందా? అనే సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే అప్పట్లో ఈ గోద్రా ఘటన దేశ రాజకీయాలను పెద్ద మలుపు తిప్పిందనే చెప్పాలి. ఈ ఘటన జరిగినపుడు ప్రస్తుత భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
Also Read: 'డార్లింగ్' ఫ్యాన్స్‌కి క్రేజీ న్యూస్.. 'కల్కి 2898 AD' షూటింగ్ ఎక్కడంటే?
ఈ ఘటన వెనక ఆయన ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వినిపించాయి. దాంతో ఈ కేసు అప్పట్లో పెద్ద సంచలనమైంది. ఇక గుజరాత్ సిట్, సీబీఐ, సహా పలు దర్యాప్తు సంస్థలు చివరకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఈ ఘటనలో నరేంద్ర మోదీ ప్రమేయం లేదంటూ క్లీన్ చిట్ ఇచ్చాయి. ఆనాటి ఘటన వెనక అసలు సూత్రధారి ఎవరు? ఈ ఘటన అనుకోకుండా జరిగిందా ? కావాలనే చేశారా అనేది ఈ సినిమాలో చూపించనున్నారు. బీజే పురోహిత్, రామ్ కుమార్ పాల్ నిర్మిస్తున్న సినిమాను ఎంకే శివాక్ష్ దర్శకత్వం వహిస్తున్నారు. రణవీర్ షోరే, మనోజ్ జోషి ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కింది.
మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్న గోద్రా!
టీజర్‌తో పాటు మూవీ రిలీజ్ డేట్‌పై కూడా హింట్ ఇచ్చారు మేకర్స్. మార్చి 1న ఈ మూవీని వరల్డ్ వైడ్‌గా థియేటర్లో రిలీజ్ చేసేందురు మూవీ టీం ప్లాన్ చేస్తుంది.కాగా 2002లో జరిగిన ఈ రైలు ప్రమాదంలో అయోధ్య నుంచి తిరిగి వస్తున్న 59 మంది మరణించారు. ఆ తర్వాత గుజరాత్ లో మత కల్లోలాలు జరిగాయి. గోద్రా రైలు దగ్ధం వెనుక అసలు సూత్రధారి ఎవరు, ఆ రోజు ఏం జరిగింది, గోద్రా రైలు దగ్ధం అనంతరం జరిగిన అల్లర్లకు కారణాలు ఏమిటి? అనే కోణంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటన ప్రమాదమా లేక కుట్రనా అంటూ మరోసారి చర్చకు దారి తీయబోతోంది ఈ సినిమా. మరి విడుదల అనంతరం ఈ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందో చూడాలి.