Aavesham Movie Controversy: సినిమాల్లో ప్రతీ చిన్న విషయాన్ని.. పెద్దగా చేసి చూస్తారు కొందరు ప్రేక్షకులు. సినిమాలో ఉండే డైలాగ్స్ గానీ, సీన్స్ గానీ కేవలం ఎంటర్‌టైన్మెంట్ కోసమే అనుకోకుండా దాని నుండి వివాదం సృష్టించేవారు కూడా ఉంటారు. అలాగే ఫాహద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’ మూవీ నుండి ఒక సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సీన్‌లో ఫాహద్ ఫాజిల్, తన అనుచరుడి మధ్య ఉండే డైలాగ్.. హిందీ భాషను అవమానించినట్టుగా ఉందంటూ కొందరు ఈ సీన్‌ను, డైలాగ్‌ను స్క్రీన్‌షాట్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం దీనికి భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బ్లాక్‌బస్టర్ ‘ఆవేశం’..
గత కొన్ని నెలలుగా మలయాళం నుండి విడుదలయ్యే దాదాపు ప్రతీ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అవుతోంది. కేవలం కేరళలో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాలు పాజిటివ్ రెస్పాన్స్‌ను సాధించడంతో పాటు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాయి. ఒక మలయాళం సినిమా.. తెలుగులో డబ్ అయినా అవ్వకపోయినా.. దానిని సబ్ టైటిల్స్‌తో చూడడానికి అయినా తెలుగు ప్రేక్షకులు ముందుకొస్తున్నారు. ఇప్పుడు 2024 మలయాళం బ్లాక్‌బస్టర్స్ లిస్ట్‌లోకి ఫాహద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’ కూడా యాడ్ అయ్యింది. కానీ అంత బాగుంది అనుకునేలోపే ఈ మూవీలోని ఒక సీన్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో కాంట్రవర్సీ క్రియేట్ చేస్తోంది.
హిందీ వద్దు..
‘ఆవేశం’లో రంగ అనే పాత్రలో నటించాడు ఫాహద్ ఫాజిల్. సినిమా మొత్తం అజు, బిబి, శాంతన్ అనే ముగ్గురు కాలేజ్ స్టూడెంట్స్ చుట్టూ తిరుగుతుంది. ఆ ముగ్గురి కోసం వాళ్ల సీనియర్స్‌ను కొట్టడానికి కాలేజ్‌కు వస్తాడు రంగ. తనతో పాటు తన రైట్ హ్యాండ్ అయిన అంబాన్ (సజిన్ గోపు) కూడా వస్తాడు. సీనియర్స్‌ను బాగా కొట్టిన తర్వాత అజు, బిబి, శాంతన్ తన మనుషులు అని, వారిపై ఎవరూ చేయి వేయకూడదు అని మలయాళంలో వార్నింగ్ ఇస్తాడు రంగ. సినిమా జరిగేది బెంగుళూరులో కాబట్టి కన్నడలో కూడా వార్నింగ్ ఇస్తాడు. అంతే కాకుండా హిందీలో వార్నింగ్ ఇద్దామనుకునే సమయానికి ‘‘హిందీలో అవసరం లేదు’’ అని రంగను అక్కడి నుండి తీసుకెళ్లిపోతాడు అంబాన్. ఇప్పుడు ఇదే సీన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మామూలు డైలాగ్ మాత్రమే..
హిందీని అవసరం లేదు అన్నట్టుగా పక్కన పడేయం కరెక్ట్ కాదని కొందరు నెటిజన్లు ఫైర్ అవుతుండగా.. మరికొందరు మాత్రం హిందీ నేషనల్ భాష కాదంటూ చిన్న విషయాన్ని పెద్దగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది సినిమాలో చిన్న డైలాగే కదా వదిలేయమని కొందరు అంటుంటే మరికొందరు హిందీ ప్రేక్షకులు మాత్రం ఈ డైలాగ్ వల్ల చాలా హర్ట్ అయ్యామంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదలయిన ‘ఆవేశం’.. ఓ రేంజ్‌లో పాజిటివ్ రెస్పాన్స్ అందుకొని సూపర్ హిట్‌గా నిలిచింది. నెలరోజులు పూర్తి అవ్వకముందే మే 9న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది. ఇందులో ఫాహద్ ఫాజిల్ యాక్టింగ్‌కు ప్రేక్షకులంతా మరోసారి ఫిదా అయ్యారు.
Also Read: ‘శ్రీకాంత్’ మూవీకి పాజిటివ్ టాక్ - తన పర్ఫర్మెన్స్‌తో కలెక్షన్స్ కురిపిస్తున్న రాజ్‌కుమార్ రావు