Aamir Khan Announces Dadasaheb Phalke Biopic: ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాస్ 'దాదాసాహెబ్ ఫాల్కే' బయోపిక్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ బయోపిక్ చేసేందుకు బాలీవుడ్ లెజెండ్ ఆమిర్ ఖాన్, దర్శక ధీరుడు రాజమౌళి పోటీ పడుతున్నారు. ఈ ప్రాజెక్టు జక్కన్న చేస్తున్నారన్న వార్తలు వచ్చిన కొద్దిసేపటికే ఆమిర్ ఖాన్ నుంచి సైతం అనౌన్స్‌మెంట్ వచ్చింది.
ఎన్టీఆర్ వర్సెస్ ఆమిర్ ఖాన్
దర్శక ధీరుడు రాజమౌళి సమర్పణలో 'దాదాసాహెబ్ ఫాల్కే' బయోపిక్ ప్రాజెక్టును రెండేళ్ల క్రితమే అనౌన్స్ చేశారు. 'మేడ్ ఇన్ ఇండియా' అనే బహు భాషా చిత్రాన్ని రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ మూవీని జక్కన్న తనయుడు కార్తికేయ, వరుణ్ గుప్తా సంయుక్తంగా నిర్మించనున్నట్లు చెప్పారు. నితిన్ కక్కర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుందనే అప్పట్లో వార్తలు రాగా.. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అప్‌డేట్ లేదు.
తాజాగా ఈ స్టోరీని ఎన్టీఆర్‌కు వినిపించగా.. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ వినిపించింది. ఈ క్రమంలో దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ మళ్లీ ట్రెండింగ్‌గా మారింది. దాదాసాహెబ్ ఫాల్కేగా ఎన్టీఆర్ ఫోటోలు సైతం వైరల్‌గా మారాయి. ఈ స్టోరీలో భారతీయ సినిమా పుట్టుక.. అది ఎదిగిన తీరును ప్రపంచానికి చూపనున్నట్లు చెప్పారు. ఈ అనౌన్స్‌మెంట్‌తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు.
వెనువెంటనే ఆమిర్ ఖాన్
సరిగ్గా.. ఈ వార్తలు వచ్చిన 24 గంటల్లోనే బాలీవుడ్ లెజెండ్ ఆమిర్ ఖాన్ సైతం 'దాదాసాహెబ్ ఫాల్కే' బయోపిక్‌ను అనౌన్స్ చేసినట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ పోషించనుండగా.. ఈ చిత్రానికి రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ 'ఎక్స్'లో పోస్ట్ పెట్టారు.
రాజ్ కుమార్ హిరాణీ, అభిజిత్ జోషీ, హిందూకుష్ భరద్వాజ్, ఆవిష్కర్ భరద్వాజ్‌లు ఈ బయోపిక్ కోసం నాలుగేళ్లుగా స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. 'సితారే జమీన్ పర్' రిలీజైన వెంటనే ఈ బయోపిక్ కోసం ఆమిర్ సిద్ధం కానున్నారని.. ఈ ఏడాది అక్టోబరులోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని సమాచారం. ఈ చిత్రానికి దాదాసాహెబ్ మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ తన వంతు సాయం అందించనున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. 'త్రీ ఇడియట్స్' (2009), 'పీకే' (2014) వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత హిరాణీ, ఆమిర్ కలిసి ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేయనున్నారు.
Also Read: సమంత రాజ్‌లపై రూమర్స్ - తప్పుడు వార్తలు ప్రచారం చెయ్యొద్దన్న మేనేజర్
నెక్స్ట్ ఏంటి?
ఆమిర్ ఖాన్ తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ అనౌన్స్ చేయడంతో మరి.. రాజమౌళి సమర్పణలో ఎన్టీఆర్ హీరోగా కార్తికేయ ఈ ప్రాజెక్ట్ తీస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై ఎవరూ ఇంతవరకూ అధికారికంగా స్పందించలేదు.
ఇక 'మహాభారతం' ప్రాజెక్టు కోసం కూడా రాజమౌళి, ఆమిర్ ఖాన్ ఇప్పటికే పోటీ పడుతున్నారు. అది తమ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ పలు సందర్భాల్లో ఇద్దరూ చెప్పారు. 'మహాభారతం'లో తనకు కృష్ణుడి క్యారెక్టర్ చాలా ఇష్టమని.. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అంటూ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఆమిర్. ఈ మూవీ కోసం టీంను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలిపారు.