హర్షసాయి.. సోషల్ మీడియాలో ఈయన పేరు తెలియనవారంటూ ఎవరూ ఉండరు. ముఖ్యంగా యూట్యూబ్‌లో ఆయన చేసే వీడియోలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. పేదలకు భారీ స్థాయిలు డబ్బులను విరాళంగా ఇస్తూ హర్ష సాయి బాగా ఫేమస్ అయ్యారు. అంతేకాదు.. ఆయన మాటలు, గళానికి కూడా అభిమానులు ఉన్నారు. ఒకప్పుడు టిక్ టాక్‌ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన హర్ష సాయి ఆ తర్వాత క్రమేనా యూట్యూబర్‌గా మారి.. యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ క్రేజ్‌తో ఇప్పుడు హర్ష సాయి.. ఇప్పుడు ఏకంగా హీరోగా మారిపోయారు. ‘మెగా - లో డాన్’ అనే మూవీతో ప్రేక్షకుల ముందు వస్తున్నాడు. ఇప్పటికే యూట్యూబ్‌లో విడుదలైన ఈ మూవీ టైటిల్ టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. అంచనాలను కూడా పెంచేస్తోంది. 


టైటిల్ టీజర్ ప్రారంభోత్సవంలో భాగంగా హర్షసాయి తన స్పీచ్‌తో ఆకట్టుకున్నాడు. అసలు తాను ఈ మూవీస్‌‌లోకి ఎందుకు వచ్చాననే విషయాన్ని తన అభిమానులకు వెల్లడించారు. ‘‘నేను హోటల్ నుంచి ఈవెంట్‌కు వస్తున్నప్పుడు.. ఒకతను, నేను మీ అభిమానిని.. మీరు నటించిన ఆ మూవీ టైటిల్ టీజర్‌ను చూడవచ్చా అని అడిగారు. దీంతో సరేనని ఆయనకు చూపించాను. అది ఆయనకు బాగా నచ్చింది. అయితే, ఆయన మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నా అన్నాడు. సరే అడగండి అన్నాను. దీంతో ఆయన నీకు సినిమా ఎందుకు? అని అడిగారు. అతనికి నేను ఇచ్చిన సమాధానాన్ని మీకు కూడా వేదికపై చెప్పాలని అనుకుంటున్నా’’ అని హర్షసాయి వెల్లడించారు. 


‘‘మీరు చిన్నప్పుడు చదువుకున్న పాఠాలు గుర్తున్నాయా?’’ అని ప్రేక్షకులను అడిగారు. ఇందుకు ప్రేక్షకులు.. గుర్తులేవని సమాధానం ఇచ్చారు. ‘‘మరి దాహంతో ఉన్న కాకి కథ?’’ అని హర్ష అడిగారు. ఇందుకు ప్రేక్షకులు గుర్తుందని తెలిపారు. ‘‘మనకు పాఠాలు సరిగ్గా గుర్తుండవు. కానీ, కథలు, మంచి సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అందుకే, నేను సినిమాలను ఎంచుకోవాలని అనుకున్నాను. అలాగే, ఒకాయన.. సినిమాలు తీసుకుంటూ పోతే.. డబ్బులు వస్తూనే ఉంటాయని అన్నారు. ఎవరికైనా ఇవ్వాలంటే మనకు డబ్బు కూడా అవసరమే కదా.. అందుకే సినిమాలు చేస్తున్నా’’ అని హర్షసాయి పేర్కొన్నారు. 


టైటిల్ టీజర్ ఎలా ఉంది?


ఇక హర్ష సాయి నటించిన ‘మెగా - లో డాన్’ టైటిల్ టీజర్ విషయానికి వస్తే.. తప్పకుండా ఇది ఆయన అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటి సినిమానే. కానీ, మొదటి సినిమాలోనే ఆయన భుజాలపై చాలా భారాన్ని వేసుకుంటున్నారేమో అనే ఫీలింగ్ కలగకమానదు. విజువల్‌గా ఈ మూవీ చాలా రిచ్‌గా ఉంది. హర్ష సాయి బేస్ వాయిస్‌తో చెబుతున్న డైలాగులు కూడా బాగానే ఉన్నాయి. కథలో కూడా ఏదో కొత్తదనం ఉన్నట్లు డైలాగులు, సీన్స్‌ను బట్టి అర్థమవుతోంది. కానీ, ఆ కథలో హర్ష సాయి ఇమడగలడా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, ఒక్క అన్నం మెతుకు పట్టుకుని.. బియ్యం ఉడికిందా లేదా అని చెప్పడానికి వంటకాదు.. సినిమా. రిలీజైన తర్వాతే.. దాని గురించి పూర్తిగా చెప్పగలం. మరి హర్షసాయి సినీ రంగంలో కూడా మెప్పిస్తారో లేదో చూడాలి. 


 ‘మెగా - లో డాన్’ టైటిల్ టీజర్‌ను ఇక్కడ చూడండి:



Also Read: డై హార్డ్ ఫ్యాన్ అంటే ఇతనే - వెంటిలేటర్‌తో థియేటర్‌కు వచ్చి 'జవాన్' సినిమా చూసిన వీరాభిమాని!