తమిళ స్టార్ హీరో విక్రమ్, తన కొడుకు ధృవ్ విక్రమ్ నటించిన ‘మహాన్’ సినిమా ట్రైలర్‌ను అమెజాన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది. స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సిమ్రాన్, బాబీ సింహా కీలక పాత్రల్లో కనిపించారు.
స్కూల్లో టీచర్‌గా పని చేసే విక్రమ్‌ను తన స్టూడెంట్స్ మహాన్ అని వెక్కిరించే సీన్‌తో ఈ ట్రైలర్ ప్రారంభం అయింది. విక్రమ్ తన తండ్రి లక్ష్యం కోసం పని చేస్తున్నాడని మిగతా పాత్రధారులతో చెప్పిస్తారు. విక్రమ్ భార్య పాత్రలో సిమ్రాన్ కనిపించింది. మద్య నిషేధ పోరాటాన్ని ముందుండి నడిపించే వ్యక్తి.. మద్యం సిండికేట్ లీడర్ అయితే ఎలా ఉంటుంది అనే పాయింట్‌తో సినిమా రూపొందిందని ట్రైలర్ బట్టి తెలుస్తోంది.
ఇక తండ్రి అంటే పడని పాత్రలో ధృవ్ విక్రమ్‌ను చూపించారు. ‘ఏపీ మందు సామ్రాజ్యానికి మహారాజు నా బాబు’ అనే డైలాగ్‌తోనే ధృవ్ విక్రమ్ పాత్ర ఎలా ఉండనుందో తెలిపారు. అయితే ధృవ్ విక్రమ్ పాత్రలో చాలా ఇంటెన్సిటీ కూడా కనిపిస్తుంది. తన బాడీ బిల్డింగ్, యాక్షన్ సన్నివేశాలు కూడా ట్రైలర్‌లో చూపించారు.
ట్రైలర్ చివర్లో విక్రమ్ తెల్ల పంచె, తెల్ల చొక్కా వేసుకుని మహాత్మా గాంధీ విగ్రహంతో నడుచుకుంటూ వెళ్లడం చూపించారు. అంటే చివరికి హీరో మారిపోయాడని కూడా ట్రైలర్‌లోనే చూపించారన్న మాట. సాధారణంగా హీరో చివరికి మారాడా.. లేడా.. అనేది సస్పెన్స్‌గా ఉంచుతారు. దీన్ని కొత్తరకం అప్రోచ్ అనుకోవచ్చు.
కార్తీక్ సుబ్బరాజ్ ముందు సినిమా 'జగమే తంత్రం' కూడా ఓటీటీలోనే విడుదలైంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఆ సినిమాను విడుదల చేశారు. ఇప్పుడు 'మహాన్' కూడా ఓటీటీకే వెళ్తుంది. ఈ సినిమాను మాత్రం అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయనున్నారు. ఇటీవల తమిళ పెద్ద హీరోల సినిమాలు ఓటీటీవైపు చూపులు చూస్తున్నాయి. ధనుష్ హీరోగా నటించిన ‘మారన్’ కూడా డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో డైరెక్ట్‌గా స్ట్రీమ్ కానుంది.