తమిళ సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో చియాన్ విక్రమ్. స్టైలిష్ పాత్రలతో పాటు ఊరమాస్ గెటప్స్ లోనూ అదరగొట్టడంలో తనకు తానే సాటి. ఎన్నో విలక్షణమైన పాత్రలను పోషించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన హీరోగా మరో సినిమా షురూ అయ్యింది. ‘చియాన్ 62’ వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ పనులు మొదలయ్యాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ఈ మేరకు అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్ చేశారు.
ఆకట్టుకుంటున్న ‘చియాన్ 62’ అనౌన్స్ మెంట్ వీడియో
‘చియాన్ 62’ వీడియో గ్లింప్స్ లో వెర్సటైల్ యాక్టర్ విక్రమ్ అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకున్నారు. ఈ వీడియో అంతా పోలీస్ స్టేషన చుట్టూనే తిరుగుతుంది. ఇక ఈ చిత్రంలో పార్ట్ 1కు సంబంధించిన సన్నివేశాలను గ్లింప్స్ లో చూపించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హెచ్.ఆర్.పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతుంది. ‘పన్నైయారుమ్ పద్మినియుమ్’, ‘సేతుపతి’, ‘సిందుబాద్’ సహా రీసెంట్‌గా విడుదలైన సూపర్ చిత్రం ‘చిత్తా’ (తెలుగులో ‘చిన్నా’) లాంటి డిఫరెంట్ మూవీస్‌ను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు ఎస్.యు.అరుణ్ కుమార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ ఇంటెన్స్ గ్రిప్పింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు జాతీయ అవార్డ్ గ్రహీత జి.వి.ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్నారు. హెచ్.పిక్చర్స్ బ్యానర్‌పై రియా షిబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
వరుస సినిమాలతో విక్రమ్ ఫుల్ బిజీ
ఇప్పటికే ‘ధృవ నక్షత్రం’, ‘తంగలాన్’ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు చియాన్ విక్రమ్. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ‘ధృవ నక్షత్రం’ సినిమా తెరకెక్కుతోంది. తమిళంలో 'ధృవ నచ్చతిరమ్'గా రూపొందుతోంది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల అవ్వాల్సి ఉంది. 2016 లో సెట్స్ పైకి వెళ్లిన ఈ చిత్రం మధ్యలో ఆగిపోయింది. మళ్లీ 2022లో ఈ చిత్రం ట్రాక్ లోకి వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ఆ తర్వాత నుంచి సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో ఈ సినిమా విడుదల కాదని అంతా భావించారు. కానీ, ఎట్టకేలకు ఈ చిత్రాన్ని వచ్చే నెలలో విడుదల చేస్తున్నారు. యాక్షన్ అండ్ స్పై జోనర్ లో వస్తున్న ఈ మూవీలో విక్రమ్ జాన్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో విక్రమ్ భారతదేశ జాతీయ భద్రతా సంస్థ కోసం పనిచేసే 10 మంది రహస్య ఏజెంట్ల బృందానికి నాయకత్వం వహిస్తాడు. ఈ మూవీని నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు విక్రమ్ 'తంగలాన్' అనే మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్ ఓ ప్రయోగాత్మక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ‘చియాన్ 62’ వీడియో అనౌన్స్ మెంట్ సినీ అభిమానులలో మరింత సంతోషాన్ని కలిగిస్తోంది.
Read Also: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, ప్రముఖ నటుడు కన్నుమూత
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial