సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినీ కెరీర్ లోనే అద్భుత విజయాన్ని అందుకున్న చిత్రం ‘బాషా’. మాఫియా కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసింది. అద్భుత నటనకు తోడు చక్కటి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాను ఓ స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తుందంటే చాలు అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. 1995 జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ‘బాషా’ చిత్రం, 28 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం తెలుగు రీమేక్ కు సంబంధించి దర్శకుడు సురేష్ కృష్ణ గతంలో చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు మళ్లీ వైరల్ అవుతున్నాయి.
‘బాషా’ తెలుగు రీమేక్ కు నో చెప్పిన చిరంజీవి!
రజనీకాంత్ ‘బాషా’ చిత్రం అప్పట్లో ఏకంగా ఏడాది పాటు ఆడి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 35 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రమే సరిపోతారని సురేష్ కృష్ణ తెలిపారు. నిజానికి ఈ సినిమాలోని ‘బాషా’ పాత్రకు ఆయన మాత్రమే సరైన న్యాయం చేస్తారని చెప్పారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మాట్లాడిన ఆయన, మెగాస్టార్ చిరంజీవితో తెలుగు రీమేక్ చేయాలని భావించినట్లు చెప్పారు. ఆ సమయంలో చిరంజీవి ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం, తెలుగు రీమేక్ రైట్స్ విషయంలో అల్లు అరవింద్ తో బేరం కుదురకపోవడంతో వదులుకున్నట్లు చెప్పారు.
మోహన్ బాబు పేరును సూచించిన రజనీకాంత్
చిరంజీవి ‘బాషా’ రీమేక్ కు నో చెప్పడంతో, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో చేస్తే ఎలా ఉంటుంది? అని రజనీకాంత్ దర్శకుడు సురేష్ కృష్ణకు అడిగారట. అయితే, ఈ సినిమా రీమేక్ కు చిరంజీవి, ఆయన కంటే ఎక్కువ స్టార్ డమ్ ఉన్న హీరో అయితే బాగుంటుందని చెప్పారట. ఈ నేపథ్యంలో ఆ మూవీ రీమేక్ ప్రయత్నాలు అక్కడితో ఆగిపోయాయట. ‘బాషా’ చిత్రాన్ని డబ్బింగ్ వెర్షన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారట. ఈ సినిమా తెలుగులోనూ అద్భుత విజయాన్ని అందుకుంది. రజనీకాంత్ మార్కెట్ ఈ సినిమాతో టాలీవుడ్ లో బాగా విస్తరించింది. ఇక ఇప్పుడున్న తమిళ స్టార్ హీరోలలో ఏ హీరోతో ‘బాషా’ చిత్రాన్ని తీస్తే బాగుంటుంది అనే ప్రశ్నకు దర్శకుడు సురేష్ కృష్ణ అజిత్ కుమార్ అని చెప్పడం విశేషం.
బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ‘భోళా శంకర్’- బిగ్గెస్ట్ హిట్ గా ‘జైలర్’
ఇక తాజాగా చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’, రజనీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రాలు ఒక్క రోజు తేడాతో విడుదల అయ్యాయి. ‘భోళా శంకర్’ చిత్రం చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలువగా, ‘జైలర్’ మూవీ ఏకంగా రూ. 600 కోట్లు వసూళు చేసి రజనీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సినిమా చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత డిజాస్టార్‌గా నిలవగా, రజనీకాంత్ జైలర్ సినిమా 600 కోట్లు కలెక్ట్ చేసి ఆయన కెరీర్‌లోనే భారీ హిట్‌గా నిలిచింది.
Read Also: దసరాకి 3 సినిమాలకే అల్లాడిపోతే, సంక్రాంతికి అర డజను చిత్రాలు వేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial