తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పెద్ద ఎవరు? అప్పుడప్పుడూ ఈ విషయం మీద చర్చ జరుగుతూ ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తమకు, తెలుగు చిత్రసీమకు 'పెద్ద' అని కొంత మంది ప్రముఖులు వేదికలపై చెప్పిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళతో ఏకీభవించని ప్రముఖులు కూడా ఉన్నారు. ఒక సందర్భంలో తాను ఇండస్ట్రీ పెద్ద కాదని, కేవలం నటుడ్ని మాత్రమేనని చిరు చెప్పుకొచ్చారు. ఇప్పుడు మరోసారి ఆ విధమైన వ్యాఖ్యలు చేశారు.
 
చిరంజీవి తప్ప ఎవరూ లేరు - సి. కళ్యాణ్
హైదరాబాద్ చిత్రపురి కాలనీలో నూతనంగా నిర్మించిన భవన సముదాయ గృహ ప్రవేశం గురువారం జరిగింది. దానికి మెగాస్టార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. చిరుతో పాటు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాతలు సి. కళ్యాణ్, దామోదర ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. 


గృహ ప్రవేశం తర్వాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ ''మంచి మనసున్న బాస్ మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగాగృహ ప్రవేశ కార్యక్రమం జరగడం సంతోషంగా ఉంది. చిరంజీవి గారూ... ఇప్పుడు మాకు బాధ్యత నెత్తిన వేసుకునే వ్యక్తి కావాలి. మీరు తప్ప ఎవరూ లేరని ఎవరి ముందైనా మాట్లాడతాం ధైర్యంగా చెప్పగలం. ఇక్కడ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని అధిగమించాలంటే మీలాంటి వాళ్ళ మాట కావాలి. తిరిగి పని చేసే వాళ్ళు కావాలి'' అని చెప్పారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి అని చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలతో చిరంజీవి ఏకీభవించలేదు. 


పెద్దరికం అనుభవించాలని లేదు...
నేను అలా ఉండబోను! కానీ - చిరంజీవి
చిత్రసీమలో ఎప్పుడు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తన మద్దతు ఉంటుందని చిరంజీవి స్పష్టం చేశారు. అయితే... తనకు పెద్దరికం అనుభవించాలని లేదని కామెంట్ చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''మా కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ ప్రతిసారీ 'పెద్ద పెద్ద' అంటున్నారు. నా కంటే చిన్నవాళ్ళు అనిపించుకోవాలని వాళ్ళు నన్ను పెద్ద అంటున్నారు. కానీ, వాళ్ళు చాలా వయసు ఉన్నవారు. వాళ్ళు పెద్దలు. వాళ్ళకు మద్దతుగా నేనుంటాను. నా కుటుంబ సభ్యులుగా భావించే కళాకారులకు, చిత్రసీమ సభ్యులకు ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉంటాను. ఏ కష్టం వచ్చినా కచ్చితంగా నేనుంటాను. భగవంతుడు నేను కోరుకున్న దాని కంటే ఎక్కువే నాకు ఇచ్చాడు. నా వాళ్ళకు తిరిగి ఇవ్వాలని, కృతజ్ఞత తీర్చుకోవాలని ఆలోచిస్తాను తప్ప... పెద్ద సీటు మీద ఉండాలని, పెద్దరికం అనుభవించాలని నాకు లేదు. అవసరం వచ్చినప్పుడు మాత్రం భుజం కాసేది నేనే అని కచ్చితంగా తెలియజేస్తున్నాను'' అని అన్నారు.


Also Read : మెగాస్టార్ చిరంజీవిలో నటుడ్ని, నటనలో షేడ్స్ అన్నీ ఒక్క వీడియోలో చూపించిన కృష్ణవంశీ



చిరంజీవి పెద్దరికాన్ని పరిశ్రమలో కొంత మంది బాహాటంగా వ్యతిరేకించిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అందువల్ల, ఆయన ఈ విధంగా మాట్లాడారా? అవసరం వచ్చినప్పుడు సాయం చేయడం మంచిదని, మాటల్లో పడటం ఎందుకని అనుకుంటున్నారా? తెలుగు సినిమా ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఇది పక్కన పెడితే... చిరంజీవి నటించిన తాజా సినిమా 'వాల్తేరు వీరయ్య' జనవరి 13న సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 


Also Read : 'బటర్ ఫ్లై' రివ్యూ : గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారినట్టు - అనుపమా పరమేశ్వరన్ సినిమా ఎలా ఉందంటే?